Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆళ్వారుల నిష్ఠ

వేదములు పరవాసుదేవునివై భవమును వేనోళ్ళ చాటిచెప్పినవి. ఉపనిషత్తులు అంతర్యామి వైభవమును ప్రతిపాదించినవి. ఇతిహాస పురాణములు వ్యూహమూర్తి (క్షీరాబ్దిశాయి) యొక్కయు రామకృష్ణా ద్యవతారముల యొక్కయు వైభవమును వర్ణించినవి. భక్తి పరవశులైన ఆళ్వార్ల కీర్తనలతో నేర్పడిన నాలాయిర దివ్య ప్రబన్దము అర్చావతారవైభవమును కీర్తించినది. ఆళ్వారులందరు అర్చావతారనిష్ఠులు. "పిన్నానార్ వణబ్గుం శోదిత్తిరుమూழி క్కళత్తానాయ్ ముదలానాయే" జగత్కారణ భూతుడవైన ఓస్వామి, రామకృష్ణా ద్యవతారములను చాలించిన తర్వాత కూడా నిన్ను మేము సేవించుటకు వీలుగా నీవు "తిరుమూழிక్కళమ్" అనే దివ్యక్షేత్రమున వేంచేసియుండి సేవ సాయించుచున్నావు" అని తిరుమంగై ఆళ్వార్ ఈ విషయాన్ని స్పష్టముగావించినారు.

శ్లో| నానారూపోపాసా
           లక్ష్యం తావ త్త్వ మేక ఏవత:|
     అర్చోపాసాం విదదతి
           వైఖానస పాంచరా త్రాద్యా:||

నేడు మనకు ఈ అర్చోపాసనమే శరణ్యము. కావున అష్టోత్తర శత దివ్యదేశములను అచటి విశేషములను తెలియజెప్పు ఈ దివ్యదేవ వైభవ ప్రకాశికను ప్రచురింప సంకల్పించినాము.

ఈస్తుతి కావ్యమును అనుగ్రహించినవారు ఉభయవేదాంత మహావిద్వాన్ శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమా చార్యస్వామివారు. దీనిని స్వహస్తాక్షరములతో వ్రాసికొని సంరక్షించినవారు నరసాపుర వాస్తవ్యులు అస్మత్‌పితృవ్య చరణులు ఉ|వే||శ్రీమాన్ నడాదూరు వేంకట వరద కృష్ణమాచార్యస్వామివారు. వీరు ఉ|వే||శ్రీమాన్ గోపాలకృష్ణమాచార్య స్వామివ్వారి పుత్రవర్యులు. నడాదూరు వంశమునకు దత్తులు. వీరు నరసాపురంలోని శ్రీఆదికేశవ యెంబెరుమానార్‌స్వామి వారి సన్నిధిలో అధ్యాపకులుగా నిరంతరము కైంకర్యము చేయుచుండెడివారు. తమ జనక తండ్రిగారైన ఉ|వే||శ్రీమాన్‌గోపాలకృష్ణమాచార్యస్వామివారు క్రీ.శ.సం. 1903 నుండి నిర్వహించిన భగవత్‌రామానుజుల వర్ష తిరునక్షత్రోత్సవములయందు జరుగు తదీయారాదన కైంకర్యమును అనేక వ్యయప్రయాసలకోర్చి అవిచ్చిన్నముగా తాము వేంచేసి యున్నంతవరకూ జరుపుతూ వచ్చినారు. ఆకైంకర్యమును ఇప్పటికిని సోదరులు ఉ|వే|శ్రీమాన్‌కిడాంబి వేంకటాచార్యులు, యం.ఎ.గారు ఎంతో శ్రద్దతో జరుపుచున్నారు.