Jump to content

పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కృత్యవతరణిక


తే.

ఘనగగనగాంగభంగచక్రాంగపూర్ణ
శశిశిశిరశైలశారదాశంఖవికచ
కాశనీకాశవిశదప్రకాశకీర్తి
రహిఁ జెలగుచుండు తిరుపతిరాయమాళి.

57


క.

తా నన్నమాట తప్పక
నానాఁట హితంబు గలిగి నడచిన కరణిన్
దా నన్నమాట తప్పక
నానాట హితంబు గలిగి నడపు హితులకున్.

58


ఉ.

రామునియందు లక్ష్మణుఁడు రాజభక్తికళాధురీణుఁడై
ప్రేమ ఘటించుటలీల దలపించుచు నన్నయడుంగుఁదమ్ములన్
దామహనీయభక్తి కలనానలంబున దేరు మానసః
స్థేమమునం దగున్ దిరుపతి క్షితిపాలుఁ డలోలశీలుఁడై.

59


సీ.

శ్రీమన్మహాదేవసేవానుభావంబు
        గొని ధనుర్ధరుఁడైన గుహునిలీల,
గాధేయుబోధంబు గాంచి కోదండదీ
        క్షాగురుండైన దాశరథిలీల,
పరశురాము భజించి శరశరాసనకళా
        ఘనుఁడైన జాహ్నవీతనయులీల,
ద్రోణు నారాధించి బాణాసనాభ్యాస
        పటిమంబు గాంచిన పార్థులీల,


తే.

శ్రీ మహమ్మదజాఫర నామధేయుఁ
డగు శరాసనగురువరు నాశ్రయంబుఁ
బడసి విలుదాల్చి కలియుగపార్థుఁ డనఁగ
ప్రౌఢిఁ జెలువొందెఁ దిరుపతి రాయశౌరి.

60


సీ.

అబ్దిరాజన్యకన్యాలలామంబుతో
        క్రీడించుహరికి మ్రొక్కిన ఫలంబు,
ప్రాలేయగిరిరాజబాలాసమేతుఁడై
        చెలగెడు హరునిఁ గొల్చిన ఫలంబు,