పుట:Dashavathara-Charitramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మానవతు లెంతకోమలు, లైనను బతిసురతపటుత నలరుదు రసహం
బైనరవిద్యుతిసంగము, చే నందవె పద్మినులు విశేషశ్రీలన్.

322


ఉ.

ఔర యిదేటియోజన మృగాయతలోచన నన్నుఁ గోరునో
కోరదొ కోర కేమి నలకూబరముఖ్యులు నాదుబంట్లు శృం
గారము చెప్ప నేల త్రిజగంబులు నేలఁగఁ గల్మిలేదె యె
వ్వా రిఁక నన్నువంటిబలవంతులు శక్రుఁడె వచ్చి కొల్వఁగన్.

323


క.

అని యుత్సహించి యొకనెప, మునఁ జెంగటి కేగి దీనిముద్దులమాట
ల్వినవలతు ననుచు నబ్బలి, [1]తనమదిలోఁ దలఁచి మిగులఁ దత్తఱ మందన్.

324


చ.

కలకలనవ్వునెమ్మొగము కమ్మనితమ్మి యటంచుఁ దుమ్మెదల్
హళహళిఁ జిమ్మిఱేఁగ భయమంది గిఱుక్కున మోము ద్రిప్పుచోఁ
గలికిమెఱుంగుచెక్కుపయిఁ గ్రమ్మఁ దళుక్కునఁ బైఁట జాఱఁగా
బెళుకుదు నబ్బలిం గదిసి బిత్తరి యత్తఱి దత్తఱింపఁగన్.

325


చ.

వెఱవకు కీరవాణి యలివేణివి గావె మదాళిపాళికిన్
వెఱవఁగ నేల యంచు బలి వేడుకతోడ లలాటపట్టికన్
మెఱుఁగులు సిందుముంగురులు మెల్లనె చిక్కులు దీర్చి చెక్కులం
దొఱిఁగెడు ఘర్మము ల్తనదు దుప్పటిచేఁ దుడిచెన్ నయంబుగన్.

326


చ.

అలికులవేణి భృంగగరుదంచలచంచలకర్ణమంజరీ
గళితపరాగము ల్పయిని గ్రమ్మిన రాల్చునెపంబు దోఁప గాఁ
బలుమఱు జాలువాసరిగెపయ్యెదకొంగు విదుర్ప గుబ్బచ
న్నుల జిగిఱేఁగి చూపఱ కనుంగవకు న్మిఱుమిట్లుగొల్పఁగన్.

327


తే.

ఆసరోజాక్షిలీలావిలాసములకు, మరులుకొని దానవేంద్రుండు మనసిజాత
మత్తవేదండదోధూయమానమాన, [2]సాబ్జుఁడై యిట్లు పలికె నబ్జాక్షిఁ జూచి.

328


మ.

సుదతీ యెవ్వరిదాన వీ వెపుడు నెచ్చో నుందు నీనామ [3]మె
య్యది యీనీభువనైకమోహననవీనాకార మత్యద్భుతా
స్పద మయ్యెం బరమేష్టి మాపయిఁ గృపం బంచేంద్రియాత్యంతస
మ్మదముం జేయఁ దలంచి నిన్నిటులు నిర్మాణంబు గావించెనే.

329


మ.

హరిణాక్షీ యటుగాకయున్న భవదీయాకారరేఖామనో
హరశృంగారవిలాసవిభ్రమములం దావంతమాత్రంబు కి
న్నరవిద్యాధరనాగకింపురుషగంధర్వాదినానామరు
త్తరుణీరత్నములందుఁ గంటిమె వృథాతర్కంబు లింకేటికిన్.

330
  1. తననెమ్మదిలోన మిగులఁ
  2. సాబ్జుఁడయి పల్కె నబ్జాయతాక్షిఁ జూచి
  3. మె, య్యెది యీనీభువనైకమోహనతనుశృంగార మత్యద్భుతా