పుట:Dashavathara-Charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తామసంబునఁ జొక్కి యెంతయును సాత్త్వి, కమున మోహంబు తల కెక్కి కలఁగి రపుడు.

314


చ.

భళిభళి మెచ్చవచ్చు నిఁక బ్రహ్మను దీని సృజించినప్పుడే
వెలయఁగఁ జేతికి బిరుదు వేయఁగవచ్చును గొమ్మమాత్ర మా
యలరెడుముద్దుగుమ్మ నడయాడెడి బంగరుబొమ్మ గాక యీ
చెలువకటాక్ష మెవ్వరికిఁ జేరును వారు కృతార్థు లిమ్మహిన్.

315


సీ.

కంతుపట్టపుదంతి గాదేని యీయింతి ఘనమనస్సరసులఁ గలఁచు టెట్లు
కళుకుబంగరుబొమ్మ గాదేని యీకొమ్మ చిత్తంబు లాసింపఁజేయు టెట్లు
కళలూనులతకూన గాదేని యీచాన నయనోత్పలంబుల ననుపు టెట్లు
కారుమెఱుఁగుచెన్ను గాదేని యీయన్ను మోహకైతవముల మొనపు టెట్లు


తే.

చెఱకుసింగాణివింటివజీరుపువ్వుఁ, గోల గాదేని యీగోల గుఱుతు గాఁగ
హృదయమున నాటు టె ట్లని యెంచి ఱెప్ప, వైవ కీక్షించు దైతేయవల్లభుండు.

316


సీ.

గజరాజగమనసింగారంబు గనుఁగొనవలవదే కన్నులు గలుగుఫలము
జలజాక్షిమధురభాషణము లాకర్ణింపవలవదే వీనులు గలుగుఫలము
విరిఁబోఁడిజీనిచక్కెరమోవిరుచు లానవలవదే నాలుక గలుగుఫలము
చెలిచెక్కుఁగపురంపుఁబలకలు మూర్కొనవలవదే నాసిక గలుగుఫలము


తే.

గబ్బిగుబ్బల బిగ్గరఁ గౌఁగిలింప, వలవదే తళ్కునెమ్మేను గలిగినఫల
మటులు గాకున్నఁ బంచేంద్రియములు గలిగి, నన్దులకు నేమిఫలము [1]వ్యర్థములు గాక.

317


చ.

కనఁగలిగె న్విలాసములు కమ్మనిచక్కెర లొల్కుపల్కులున్
వినఁగలిగెన్ సుధారసము వెల్లువ పెట్టెడు మోవి యాన నిం
పున నునుజెక్కుటద్దములు ముద్దుగొన న్నెలవంక లుంచి చ
క్కనివలిగుబ్బచన్నుఁగవఁ గౌఁగిటఁ జేర్ప నిఁ కెఫ్డు గల్గునో.

318


క.

ఇదియే కనుటయు వినుటయు, నెదపైఁ బవళింపఁ గనుటయే గనుట రతిన్
మదనజయశంఖరణితం, బెదిరెడుమణితంబు వినుటయే వినుట గదా.

319


తే.

కుసుమకోమలమైన యీకోమలాంగి, తనువుభుజబంధనఖరదంతక్షతాల
తాపకర్షణముష్టిఘాతాదిసురత, ధార్ష్ట్యమున కోర్చునే యన్యతనువుభంగి.

320


సీ.

చక్కెర కెమోవి చవిచూడనేకాని మొనపల్లు చుఱుకన మోపరాదు
బలితంపుగుబ్బలు పట్టిచూడనెగాని నునువాడిగోరున నొక్కరాదు
[2]అంగంబు మెల్లనే యక్కుఁజేర్పనగాని మించి బిగ్గరఁ గౌఁగిలించరాదు
[3]లలితంపురతికేళి నలరింపనేకాని బంధచాతుర్య మేర్పఱపరాదు


తే.

ఈఁగ వాలినఁ గందు నీయిగురుబోఁడి, కమ్మనెమ్మేను గనఁగఁ బొంకమ్ము దెలిసి
యేలికొనవలె మన్మథకేళియందు, నాకుఁ దక్కిన మెప్పింతు నలినముఖిని.

321
  1. వంధ్యములు గాక
  2. తనులత యెదను మెల్లనఁ జేర్పనే కాని
  3. లలి రతిక్రీడల నలరింప