పుట:Dashavathara-Charitramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్తులు జాతీయములు చక్కగా వాడినాఁడు. “ముక్కునగవ్వగుట్టి నిను ముందుగ నీడిచి - అబలలము మూఁడుమాటల నాఱుతప్పులు.” ఇట్టిసహజములును, “ఆయంభోదములఁ జూచి చెర్వుజలమాద్యంతంబుఁ జల్లింతురే ” ఇట్టి స్వతంత్రములు నగు లోకోక్తులను బ్రయోగించినాఁడు. పాఠకులకు విదితము కాఁగలవని యిట విస్తరింపలేదు. సంస్కృతాంధ్రములు రెంట నీతని కవిత్వము, వర్ణనలు, కల్పనలు, మృదుమధురములు రసానుగుణములునుగా నుండును. స్వభావవర్ణముల కీతఁడు పెట్టినది పేరు. యమకములు, సంత్రనియమములు, గర్భకవిత్వము, బంధకవిత్వముఁ జక్కగ నభ్యసించినవాఁడు. స్తుతిసమయములలోఁ బలువురచే బలువితముల నాయారీతి గర్భబంధకవిత్వముం జెప్పించినాఁడు. పాఠకులు చిత్తగింతురు గాక! అదితిచేఁ బ్రాకృత సీసపద్యముతో విష్ణుస్తుతి చేయించి, స్త్రీ కావుననేమో ఇ ట్లప్రాకృతగుణాతీతయగు నదితి ప్రాకృతగుణాతీతుని (బ్రాకృతమున) వర్ణించినట్లు నుడివినాఁడు. ఆంజనేయునిచే శ్రీరాముని ఉత్పలమాలికలో మంజుభాషిణి యను వృత్తముం గూర్చి స్తుతి చేయించి రామునిచే నాతనికవిత్వమునకు మెప్పించి సీతచే ముత్యాలహారము నిప్పించినాఁడు. ఈతఁడే పక్షపాతము నసూయయులేని కవి. తానొక ప్రభువునొద్దఁ గవిత్వము చెప్పి జాంబూనదాంబరమణిభూషణాదులం గొనుకవి తనవంటి కవులకును ప్రభు సంస్థానములలోఁ జెప్పి యిప్పించిననేగదా కీర్తికలుగును, ఇక్కవి తెనుఁగుప్రాకృతము సంస్కృతము పదములే కాక అన్నగళు (అఱవము) చికరాయపట్టము (కన్నడము) సాహెబూ (హిందుస్తానీ) పదములనుగూడ వాడినాఁడు.

శృంగారవర్ణనములకుఁ గడఁగెనా యీతని కొడలు తెలియదనుట సాహసము కాఁగూడదు. బాలురగు రామలక్ష్మణుల యొద్ద విశ్వామిత్రుని చేత నహల్యచరిత్రమును బచ్చిపచ్చిగా వర్ణింపించినాఁడు. ఇంద్రునిచేష్టలు మానవసామాన్యముగా నున్న వనిపించినాఁడు, కృష్ణుఁడు, గోపికలు, వీరలవిషయము చెప్ప నక్కఱయే లేదు. ఏవిషయముననుగూడ శృంగారించి చెప్పఁజూచును, అదితి స్త్రీ, యీమె చేసిన విష్ణుస్తుతిలోఁ గూడ "ళచ్ఛిత్థణాహేయలలిఅహత్థపయోఅ ” (లక్ష్మీస్తనాధేయ లలిత హస్తపయోజ) అనిపించినాఁడు. కొన్నితావులఁ జెప్పవలసినవిషయము తగ్గించి వర్ణనలు విస్తరించినాఁడు. కవులనఁగా వర్ణించువారేకాని స్థలము, సమయము, తదుచితముగూడ నాలోచించుచుండవలయును. ఇందేకాదు, ఈవిషయము సర్వసామాన్యముగాఁ గథనుమాత్రమే తెల్పవలసిన పురాణములలోఁ