పుట:Dashavathara-Charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గూడఁ బూర్వులిట్లే సమయోచితముచూడకుండ వర్ణించియున్నారు. రామపరశురాముల సంభాషణము చాలఁ దగ్గించినాఁడు. బుద్ధినిబోధలు క్రొత్తవి యంతగా లేవు. ఇట్టులే పాఠకులు చదివిన నాయాస్థానముల విశదము కాఁగలదు.

ఈ గ్రంథమును బ్రకటించుటకు బహుప్రతులలో సరిచూడవలసివచ్చినది.

1. ఆంధ్రసాహిత్యపరిషత్తులోని పీఁచుకాగితములప్రతి - ఇది నలనామ సం॥ మాఖ బ 10 జయవారమున దుగ్గిరాల చినసుబ్బయ్యగారి కుమారుఁడు నరసింహముగారు బందరు ఖొజ్జిల్లిపేఁటలో నివసించు భూమకరు సీనయ్యగారను శ్రీనివాసరావుగారి ప్రతినిజూచి వ్రాసినది. (2) పరిషత్తులోని తాళపత్రప్రతి - అఱవదేశపుది. కోరప్పటి వేంకటరామయ్యగా రిచ్చినది. ఈ రెంటిలో నక్కడక్కడఁ గొన్నిభాగములు లేవు.

2. దొరతనము వారి ఓరియంటల్ లైబ్రరిలోఁ గొన్నిటీకలు గొన్నిమూలమాత్రములును గలవు. అందును రెండుతాళపత్రప్రతులు పూర్తిగానున్నవి. తక్కినవి యసంపూర్ణవ్రతులు, టీకలలో మూఁడునాలుగాశ్వాసములకు టీకలు లేవు. పంచమాశ్వాసములోని ప్రాకృతసీసము వ్రాయకుండ విడిచిపెట్టఁబడియెను. ఒకకాగితము మూలములోనే యాపద్యము విడిచి స్థలముమాత్రము వదలినారు. పూర్ణగ్రంథములలోఁ బాఠభేదములు ననర్థములు వ్రాఁతతప్పులు మెండుగానున్నవి.

ఈదశావతారచరిత్రమును బుష్పగిరితిమ్మన్న రచియించెనను వాడుక గలదు గాని రచననుబట్టి యిది తిమ్మన్నకవిత్వముగాఁ దోఁపదనియు నట్లు వదంతిపుట్టుటకుఁ గారణము కనఁబడదనియు రా. బ. వీరేశలింగము పంతులుగారు వ్రాసినారు.

ఈ పుస్తకమునఁ జాలఁభాగము చక్కఁజేసి ముద్రించినారము. అయినను లోపము లింక నుండవచ్చును. ఆలోపములను బాఠకులు దెల్పిన రెండవసారి ముద్రించునపుడు తప్పక సవరించెదము, పాఠకబృందము మేము శీఘ్రకాలములో ద్వితీయముద్రణము గావించున ట్లాశీర్వదించునుగాక!

తండయార్పేట,

ఇట్లు,

చెన్నపురి. 6-2-1926.

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్.