పుట:Dashavathara-Charitramu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ గ్రంథమును రచించిన కవి ధరణీదేవుల రామయమంత్రి. నియోగిబ్రాహ్మణుఁడు. ఈతని తాత తిమ్మయమంత్రి. తండ్రి నాగయమంత్రి. తల్లి ఫణియమ్మ, ఈ గ్రంథమునందు శ్రీమహావిష్ణుని దశావతారములును గూర్చినకథ చెప్పఁబడినది. పదియవతారముల కథను బదియాశ్వాసములలో నిమిడ్చినాఁడు. రామావతారకథ రెం డాశ్వాసములక్రిందను, బుద్ధకల్క్యవతారములు రెంటికథను నొక్కయాశ్వాసముక్రిందనుఁ జెప్పినాఁడు. రామావతారకథవంటి పెద్దదియైనను బలరామావతారకథను రెండాశ్వాసములక్రింద రచియింపలేదు గాని, కృష్ణచరిత్రమును రెండవభాగముగా విభజించినట్లున్నది. ఈగ్రంథము మగదల కృష్ణమంత్రి కంకితము చేసినాఁడు. ఈకృష్ణమంత్రి నెల్లూరిమండలములోని ప్రళయకావేరిపట్టణములో గతశతాబ్దాంతము దొలాందావారికి ద్విభాషిగా నుండెనని యాంధ్రకవులచరిత్రమునఁ దెలియవచ్చుచున్నది. గత శతాబ్దాంతమనఁగా, నాంధ్రకవులచరిత్రమే 19-వ శతాబ్దాంతమందు రచియింపఁబడి యుండుట చేత 18-వ శతాబ్దాంత మనుకొనవలయును. మఱియుఁ బుష్పగిరి తిమ్మన్న, కంకంటి పాపరాజులు రామయమంత్రికి సమకాలికులైనట్లు తెల్పుచు వారివిషయము 1790 ప్రాంతముననని కవుల చరిత్రము వ్రాయుట కూడ దీని కాధారము.

ఈ రామమంత్రి సంస్కృతప్రాకృతాద్యష్టభాషలు నేర్చినవాఁడు. అట్టివానికిఁ దెనుఁగుకవిత్వము లెక్కలోనిదిగాదు. పూర్వకవులు సంస్కృతముతోపాటు స్వభాషను గూడఁ గృషి చేయుచుండెడివారు. పెద్దపెద్ద పండితులయొద్దఁ గాశి మొదలగుతావులఁ జదువుకొనివచ్చి (సంస్కృతమును) యింటికడ మాతృభాషను బరిశ్రమ చేయువారు కావచ్చును. కవులు చేయు గురుస్తుతి సంస్కృతవిద్యాభ్యాసము చేయించిన గురువులస్తుతియనియే తలఁపవచ్చును. ఈవిషయ మింతకంటె నిక్కడ నప్రస్తుతము. ఈకవి సంస్కృతమును దెనుఁగును చక్కఁగా గ్రంథమం దంతటను వాడినాఁడు. సంస్కృతవాక్యములను దెనుఁగుపద్యములనడుమ “అద్యభవే త్తవ సర్వమంగళావాప్తిః”అటంచు నీరీతిగాను జేర్చును. పాణౌకృతి, నాభౌసరోజుఁడు, దంభూతవామాంగుఁడు - మొదలగుపదములఁ బ్రయోగించెను. తెనుఁగునను గూడ నపూర్వపదప్రయోగము గావించినాఁడు కాని యందందు, “అదేమే వైరినెన్నేవు, నవ్వేరెవరైన, ఇంట్లో వారికి దుఃఖించ ఇట్టి వ్యాకరణవిరుద్ధపదములు కలవు. లోకో