పుట:Dashavathara-Charitramu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పొన్నలు పోఁకమ్రాకులును బూచినసంపెఁగలున్ మధూకము
ల్తిన్ననినారికేళములు తియ్యనిద్రాక్షలు గుజ్జుమావులుం
గన్నులగోరగించు జగిగల్గిన మోదుగులున్ వనంబులో
నన్నియుఁ జూచి కాంచి చెలు లచ్చట నచ్చటఁ బూలు గోయుచున్.

74


క.

పదిరెండేడులపాయపు, సుదతీమణి యవయవములు సొబగుదలిర్పన్
గుదిగొనఁ జిగిర్చి తమక, ట్టెదుటం గనుపట్టురావు లీక్షించి సతుల్.

75


క.

బుద్ధముని చెప్పినటువలె, బద్ధాదరచిత్తవృత్తి పాటించి తమిన్
సిద్ధంబుగ మనకోరీకి, సిద్ధించు నటంచుఁ గొలను సేరి పురంధ్రుల్.

76


సీ.

కురువేరు మొగలిరేకులు పెట్టి యల్లినజడ విప్పి కీల్గొప్పు సవధరించి
బిగిచన్నుఁగవ గుత్తమగుముత్తియవుజంటఱవికె సడల్చి హారములు దివిచి
తళుకులేఁజెక్కుటద్దముల విద్దెముచూపు కట్టాణికమ్మలు కదియ నదిమి
చిలుక బవంతిచీరెలు గట్టుపై నుంచి బెడఁగు చెంగావిపావడలు విడిచి


తే.

మారుఁ డొఱఁదీయ మెరయుకటారు లనఁగ, సోఁకుమూఁకమిటారులు సోలిగాఁగఁ
గొదమరాయంచబారుల యుదుటు దెగడి, కొలను సొచ్చి విహారము ల్సలుపునపుడు.

77


సీ.

పెంటిఁ గానఁగలేక బిస్సున వలిగుబ్బచంట వ్రాలెడు చక్రవాకమునకుఁ
తల్లిఁ గానఁగలేక తళుకుబిత్తరితేఁటి వాలుఁగన్నుల వ్రాలు వాలుగకును
గొదమలఁ గానక గుమికూడి యలకభాగమ్ములఁ గ్రుమ్ము భృంగంబునకును
దోడియంచలఁ బాసి తొగరాకుటడుగులఁ బెనఁగెడు రాయంచపిలుకలకును


తే.

బెళికి తప్పించుకొనుచు బిట్టులికిపఱచు, కలికి నవ్వుదు రావె యీవలికి నీవు
వలికి వెఱచిన నని కేరి పలికికొనుచు, వెలఁదిమిన్నలు నీరాడి వెడలునపుడు.

78


తే.

వారి వీక్షించి యామునవారి వెడలి, గోపవారిజనేత్రలు కోక లడుగ
వచ్చునాఁటి విలాసంబు మెచ్చుకొనుచు, నుల్లమున నెన్నెఁ జెట్టున నున్న శౌరి.

79


సీ.

అపుడె వెన్నాడు దుర్యశమన నంసభాగమునఁ గన్పట్టు కీల్గంటుతోడఁ
బదిలమైయుండుము హృదయమా యనురీతిఁ జనుఁగవగదియు హస్తంబుతోడ
నిది దాఁచుకొన్నఁ దా నేమి సేయునటన్న కరణి నందుంచిన కరముతోడ
నభిమానములు ప్రోవుమని నమస్కృతి సేయు గతిమించు నానతాంగంబుతోడ


తే.

బెళుకుఁజూపులు నునుసిగ్గు మొలకనవ్వు, కదలుపిఱుఁదును మిగులసింగార మొలకఁ
గులుకునడఁ జేరి దిసమొల పొలసుదిండి, లేము లశ్వత్థములఁ గౌఁగిలించి రపుడు.

80