పుట:Dashavathara-Charitramu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అసురాజాస్యలు కౌఁగిలించుతఱి నయ్యశ్వత్థనారాయణుం
డసమాస్త్రోపమరూపరేఖఁ దగి బుధ్ధాకారుఁడై తాను ది
గ్వసనుండై దనుజాంగనాకుచతటీగాఢాంకపాళిక్రియా
రసికుండై కళ లంటఁ జొక్కిరి సతుల్ రాగాబ్ధినిర్మగ్నలై.

81


మ.

జను లగ్గింప జలంధరాసురుని వేషంబూని తత్కాంతబృం
దను గామింపఁడొ గొల్లగుబ్బెతల మానం బెల్లఁ గొల్లాడఁడో
దనుజధ్వంసికిఁ గ్రొత్తయే త్రిపురకాంతాసంగధౌర్త్యంబు గ
ల్గినఁజాలుం జెలు లేడనైనఁ గలయున్ లీలావినోదంబులన్.

82


తే.

అంత మఱి యేమి చేసెనో యసురసతులు, బుద్ధదేవర యిది యేల ప్రొద్దువోయెఁ
గడమకథ విను మాదిత్యగణము గొలువఁ, గమలలోచనుఁ డీశుచెంగటికి నరిగి.

83


సీ.

తనమహీమహిళ శతాంగంబుగాఁ జేసి కన్నుల రెంటిఁ జక్రములు చేసి
బలితంపుటూర్పుగాడ్పుల హయంబులు చేసి యాత్మజాగ్రేసరు యంతఁ జేసి
యగ్రజుబలగ మి ల్లస్త్ర్రాసనముఁ జేసి సెజ్జయౌ చిలువ శింజినిగఁ జేసి
బలములయం దర్ధబలము రథిం జేసి తను సముత్తేజితాస్త్రముగఁ జేసి


తే.

చటులలయవహ్ని చిటచిటచ్ఛటలు వొదల, దైత్యపురములఁ గూల్చి దగ్ధంబు చేసి
శంకరుఁ బురారి యనిపించె జగములందు, శ్రితజనయశస్కరుండు లక్ష్మీశ్వరుండు.

84


మ.

కురిసెం గల్పకపుష్పవర్షములు రక్షోరాజి భీతిల్లఁగా
మొరుసెన్ నిర్జరదుందుభు ల్దివి మహాంభోవాహగర్జార్భటిన్
నెరసెం దెల్వి సమస్తదిగ్వలభులన్ నిర్నిద్రహర్షస్థితుల్
దొరసెన్ వేల్పుల నెమ్మనంబులకు నుల్లోలంబుగా నత్తఱిన్.

85


క.

శ్రీవిభుఁ డిటువలె బుద్ధుం, డై విహరించినవిధంబు హర్షము మీఱం
గా వినువారలు ప్రబలుదు, రీవసుమతి సుమతిశుభసమృద్ధులతోడన్.

86


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు నవమాశ్వాసము.

తొమ్మిదవ యవతారంబగు బౌద్ధావతారము సమాప్తము.