పుట:Dashavathara-Charitramu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

స్నానంబువలన మోక్షంబు గల్గిన నీరుకాకికి మోక్షంబు గలుగవలదె
కాకధ్యానమున మోక్షము గల్గినను దటాకము బకంబులకును గలుగవలదె
ముక్తి ప్రదక్షిణంబులఁ గల్గునన్నను కాకి గ్రద్దలకును గలుగవలదె
పుడమిఁ బశ్వాలంబమున స్వర్గమన్నను బలలభుక్కులకెల్లఁ గలుగవలదె


తే.

కాననస్థితి బోయకుఁ గల్గవలదె, బిలములందున్నఁ గలదె గబ్బిలములకును
గానయందున్న మోక్షంబు గానరాదు, క్షణికవిజ్ఞానముననె మోక్షంబు గలుగు.

44


సీ.

ఎక్కడివేదంబు లేడయాచారంబు లీవట్టిభ్రమలు మీ కేల పుట్టె
నవి యెల్లఁ గల్ల లెట్లనిన “గ్రావాణః ప్లవంతే” యనవె ఱాయి వారిఁ దేలు
నేనిర్ణ యం బెద్ది యిదిగో "ననుదితేజుహోతి" యం"చుదితేజుహోతి" యనుచుఁ
గ్రతుపశువునకు స్వర్గస్థితి గలదఁట యటులైన యజమానుఁ డాత్మజునకుఁ


తే.

బశువుఁ గావించి దివి నుండఁ బనుపరాదె, చెల్లఁబో నో రెఱుంగని జీవములను
గూయగాఁ బట్టుకొని గొంతు కోయవలెనె, తినమరిఁగి సేయుదురు గాక దనుజులార.

45


క.

ధరలో వినరే "యహింసా, పరమోధర్మ" యనియంచుఁ బ్రాణివధను జే
తురె యకట యజ్ఞవిధియని, యరయఁగ నది యజ్ఞవిధియె యగుఁ జింతింపన్.

46


క.

ఏతఱి విధియంచుం బశు, ఘాతమె మంత్రోక్తి నిదియొకటి సత్యమె యా
రీతి “నహింసా త్సర్వా, న్భూతాని” యటంచు నుడువుఁ బో శ్రుతి యహహా.

47


క.

తల పేనైనను జంపక, నలిచి విడువవలయుఁ ద్రోవ నడుచునపుడు చీ
మలనైనఁ ద్రొక్కకయె సోవలయు హెచ్చరకె జంతువధ కొఱగామిన్.

48


క.

సమిదాజ్యపశులు శిఖ భస్మములై ఫల మొసఁగెనేని మరుధర నిడుబీ
జములు ఫలింపవె యేటికి, భ్రమ క్షణకర్మములు భావిఫలదము లగునే.

49


సీ.

అంధున కొదవునే గంధేభగామినీలోకశృంగారావలోకనంబు
బధిరున కబ్బునే మధురాధరాధరాకథితనర్మోదితాకర్ణనంబు
నిర్దంతునకుఁ జేరునే నీరజాననారదనఛదాచ్ఛిదారంజనంబు
కడునపుంసకునకుఁ గల్గునే కలకంఠకంఠికారతికేళికాసుఖంబు


తే.

కర్మఫలసాధనములు భంగంబు లొందఁ, గర్మఫల మెట్లు సిద్ధించుఁ గనరుగాక
ఘటము ఘటియింపఁ దగు మృత్తికను జలంబు, లోనఁ గలసిన ఘటముగాఁ బూను టెట్లు.

50


శా.

రంభాభోగముఁ గోరి యాగముల కర్థంబెల్ల వెచ్చించు టా
యంభోదంబులఁ జూచి చెర్వుజల మాద్యంతంబుఁ జల్లించుట