పుట:Dashavathara-Charitramu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మణిమయకోటీరమండితం బగునుత్తమాంగంబు ముండితం బైనదేమి
కనకాంబరంబులు గట్టనర్హంబైన కటి కావికోకలు గట్టనేమి
యాయుధోచితమైన హసప్తద్మంబున బట్టి బర్హంబును బట్టుటేమి
జగము నేలంగఁ దేజంబు గల్గియు నిట్టి సన్న్యాస మవధరించంగనేమి


తే.

యహహ సన్న్యాసిగాఁడు సన్న్యాసియైన, దండముఁ గమండలువు నెద్ది ధరణి నెన్నఁ
డిట్టివేషంబు గనుఁగొన మెవ్వఁడొక్కొ, యీమహామహుఁడంచు దైత్యేంద్రు లపుడు.

36


తే.

తనకు మ్రొక్కిన కుశలమౌ దనుజులార, యనిన వేదోచితాచారమున మెలంగు
మాకుఁ గీడేలగల్గు సేమంబెకాక, యనినఁ బకపక నగి బుద్ధుఁ డనియె నపుడు.

37


క.

ప్రస్తుతియోగ్యమె శ్రుతివ్య, త్యస్తము పునరుక్తవాక్య మనృతోదితవి
ధ్వస్తము మఱివ్యాఘాత, గ్రస్తం బది నిజము సేయఁగా నేమిటికిన్.

38


క.

[1]“యజమానప్రస్తర” యను, నిజమా యామాట యదియ నిక్కంబైనన్
"యజ తే” యనువాక్యంబును, నిజమని నమ్ముదుము శ్రుతికి నిజముం గలదే.

39


క.

కనుఁగొన శ్రుతి యేమెఱుఁగును, దనుజాధిపులార “కోహితద్వేద” యటం
చనునే యది యెఱిఁగినచో, మన కేటికి నట్టి శ్రుతిఁ బ్రమాణము సేయన్.

40


క.

మన మెఱుఁగమె యేటికిఁ జె, ప్పెను శ్రుతి “యగ్ని ర్హిమస్య భేషజ" మనుచున్
మన మెఱిఁగిన మాత్రమె యది, యు నెఱుంగఁగనుండు యుక్తియుక్తము గాఁగన్.

41


సీ.

కర్మంబు ఫలదాత గా దీశ్వరుండంచు ద్వివిధమై మీమాంస విఫలమయ్యె
నొక్కజీవుఁడటంచుఁ బెక్కు జీవులటంచు వేదాంతశాస్త్రంబు వితథమయ్యె
హరి యెక్కుఁడంచును హరుఁ డెక్కుఁడంచును బహుపురాణంబులు పాటిదప్పె
నైకవిధ్యంబు లేదరయఁగా స్మృతుల నేతెఱఁగునఁ దీసినఁ దీయవచ్చు


తే.

దానము లొసంగి ద్విజుల నుదగ్రనరక, కూపములఁ ద్రోయుదురె మేలు గోరి తమకు
బుద్ధిహీనులు ప్రతిమలఁ బూజ సేతు, రనఁగ నెందును వినరె ప్రజ్ఞాధ్యులార.

42


సీ.

అకలంకులార యింకొకకర్మఠుల యవివేకంబు వినుఁ డతివిస్మయంబు
గర్మంబువలన వైకల్యంబు గలదటుఁ గలుగఁ బ్రాయశ్చిత్తకలనమునను
బోనఁట పాచితంబునను వైకల్యంబు బొరయఁ బోనఁట హరిస్మరణమునను
అదియె నిశ్చయమైన నాస్మరణము మున్నె సేయరాదే యేమి సెల్లెఁ దమకు


తే.

నేర్పుతోఁ గొంగనెత్తిని నెయ్యి పెట్టి, కరఁగి కన్నుల నిండినఁ గానకుండఁ
బట్టికొనవచ్చునను మతిభ్రష్టు గలఁడె, కలఁడె యననేల తాదృశు ల్కర్మరతులు.

43
  1. "యజమానః ప్రస్థర"