పుట:Dashavathara-Charitramu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దపము గావించి స్వపురమధ్యమున నొక్క, యమృతకూపంబు వడసె నీయజునికరుణ.

25


క.

అది కారణముగ దైత్యులు, త్రిదశులతో వెఱవ కెదిరి తెగినదనుజులన్
బ్రతుకంజేయుదు రొకనిం, బదుగురిఁగా నజువరప్రభావమువలనన్.

26


తే.

అయిన నేమాయె నిప్పు డాయమృతరసము, సంగ్రహింప నిశాచరాచార మడఁపఁ
బురపురంధ్రీపతివ్రతాచరిత ముడుపఁ, గడ నిశాటుల గెడప నేఁ గంటి నుపమ.

27


క.

అని యోజన దెలిపి కప, ర్దిని బలమర్దిని సురేజ్యు దివిజగణంబుం
బనిచి యజు దూడఁ గమ్మని, వనజాక్షుఁడు ధేనువై యవారితశక్తిన్.

28


తే.

ఖచరకిన్నరగంధర్వగరుడసిద్ధ, సాధ్యవిద్యాధరాదినిర్జరవితాన
దుర్గమంబైన దానవేంద్రునిపురం బు, పాయమునఁ జొచ్చి యటమట మాయ మొదవు.

29


సీ.

రాణించుచును బచ్చఱా చెక్కడపునేల మెఱుఁగుపచ్చికలంచు మేయు సొబగు
నర్భకు ల్దనదూడ నదలింప హుమ్మని వలుదకొమ్ములఁ గ్రుమ్మవచ్చు కినుక
చేఁపినపొదుగు వర్షించుదుగ్ధంబులు నించి వెల్లువలు గట్టించువింత
యొద్దిక మీఱంగ నొక్కెడ వసియించి యెడనెడ నెమరు వెట్టెడివిధంబు


తే.

గాంచి యెక్కడనుండి యిక్కడికి వచ్చె, నొక్కొ [1]యీయావు దూడయుఁ జక్క ననుచు
నసురు లచ్చెరువంద నందంద మెలఁగి, బ్రమయఁ జేయుచు నమృతకూపమునఁ దుమికె.

30


వ.

అప్పుడు.

31


ఆ.

ఆవు బావిఁ బడియె నయ్యయో కాలుఁగీ, లేమి యయ్యెనొక్కొ యెట్టు లనుచు
నగచి దైత్యులెల్ల డిగి యెత్తఁ జని యందు, ధేను వమృతరసముఁ గానలేక.

32


క.

ఆవిటుల నేర్చునే మా, యావియ యిది యనుచుఁ దారకాక్షాసురుతో
నావింత దెలుప దనుజుల, లావింతట నణఁగెనని ప్రలాపాన్వితుఁడై.

33


క.

శోకించు తారకాక్షుని, వ్యాకులభావంబు తత్త్వవైఖరి వెలయన్
లోకోక్తులు దెలుపుచును ని, రాకృతి గావించె మయమహాయోగి యటన్.

34


మ.

కరపద్మంబున బర్హిబర్హము వొసంగం జూళికాహీనమై
శిరమున్ బంగరుబొంగరంబువలె రాజిల్లం గటీలోహితాం
బర మొప్పాఱఁగ నుజ్జ్వలప్రభ దలిర్పన్ వార్ధికన్యామనో
హరుఁ డాదైత్యులఁ జేరఁగాఁ జనియె బౌద్ధాకార మేపాఱఁగన్.

35
  1. యీయావు చక్కనై యున్న దనుచు