పుట:Dashavathara-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యమ్మునివరుండు, క్ష్మారమణ యైహికాముష్మికంబు లింత
సులభములె యైన వినిపింతుఁ దెలివి గాఁగ, నప్రమత్తుఁడవై విను మాదరమున.

105


ఆ.

మేదినీశ వినుము “నాదత్తముపతిష్ఠ, తే” యనంగఁ గర్మదృఢత లేక
యిహసుఖంబు గల్లు నెట్లు “జ్ఞానాన్మోక్ష”, మనఁగ నజ్ఞుఁ డెట్టు లందు ముక్తి.

106


క.

గుణజలనిధిగహనా “క, ర్మణోగతి” యనంగ సులభమాకర్మము దా
రుణము “శుకో ముక్తే” యని, గణుతింపఁగ నెటులు ముక్తి గల దన్యులకున్.

107


తే.

కానఁ గర్మంబు లాత్మవిజ్ఞానసరణి, దుర్లభములు విశేషించి దుష్టమైన
కలియుగమువేళ నెటువలెఁ గలుగు నైన, నొకయుపాయంబు దెల్పెద యుక్తముగను.

108


ఉ.

కృష్ణదశావతారములు కేవలభక్తిని విన్న సజ్జనుల్
జిష్ణుసమానవైభవము జెంది యిహంబున నంతమీఁదటన్
వైష్ణవధామ మొందుదు రవశ్యము వశ్యము సుమ్ము రెంటికిన్
గృష్ణకులీన యన్న నృపకేసరి యెంతయు సంతసంబునన్.

109


తే.

పద్మనాభుండు పాండవపక్షపాతి, యందు మిక్కిలి విజయున కనుఁగు గానఁ
దత్కథలె విందుఁ గృష్ణావతారపూర్వకముగ వినిపింపు మవతారకథల ననిన.

110


శా.

శ్రీకల్యాణగుణంబుల న్సమతచేఁ జెన్నొందియు న్భక్తర
క్షాకౌశల్యముఁ దెల్ప ధర్మసుతు రాజ్యశ్రీయుతుం జేసి యెం
తే కుంతీసుతపక్షపాతి యనుకీర్తిస్ఫూర్తి వర్తిల్లు నా
శ్రీకృష్ణుండు కృపాకటాక్షమున రక్షించు న్బుధవ్రాతమున్.

111


సీ.

ధరణీశ కృష్ణావతారంబు మున్నుగా వినిపింపు మని దన్ను వేఁడినాఁడ
వవతారములలోన నాకృష్ణచరితంబు గణియింతు రందు నొక్కటిగ బుధులు
బలభద్రుచరితంబు దెలిపినపిమ్మట నుడివెదఁ దదనుజన్ముని చరితము
మానసం బలరార మత్స్యకూర్మవరాహనారసింహాద్యవతారకథలు


తే.

వినుము క్రమమున వీనులవిందు గాఁగ, నీసమంచితభక్తి వర్ణింప వశమె
తపము ఫలియించె జన్మంబు ధన్యమయ్యె, గలిగె భాగ్యంబు శ్రీవిష్ణుకథలు దెలుప.

112


క.

అని పులకాంకురములు మై, దనరఁగ మోదాశ్రు లొలుకఁ దన్మయచితంతం
బున నలరుచు వైశంపా, యనముని దెలుపంగఁ దొడఁగె నధిపతి వినఁగన్.

113