పుట:Dashavathara-Charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శ్రీశంపాయతలోచనారమణచారిత్రాపగాసంభవ
శ్రీశైలంబగు థాతురాగజటలున్ శృంగారనిష్యందనీ
కాశప్రక్రియ జన్నిదంబు లతివక్షస్పూర్తి శోభిల్లఁగా
వైశంపాయనుఁ డేగుదేర భవనద్వారంబునం జూచుచున్.

97


క.

దౌవారికవరుఁ డొక్కఁడు, వేవేగ న్వచ్చి విన్నవించిన గురునిం
దేవేంద్రుఁ డెదురుకొనుగతి, భూవరశాసనుఁడు వినయమున సత్వరుఁడై.

98


సీ.

సౌవిదల్లులు చేరి సముఖా యనఁగ గద్దె డిగునంతలోన దుండీరుఁ డిడిన
నెఱమించుచండవన్నియచెక్కడపుబొమ్మ చికిలిదంతంపుపాదుకలు దొడిగి
పాండ్యుఁ డడ్డము పట్టు పావడ మఱుఁగున లాటభూభర్త గాళాంజివూన
గండూష మొనరించి కర్ణాటపతిచేతిపావడం దడియొత్తి పసిఁడిసరిగె


తే.

చలునదుప్పటివలెవాటు వెలయ రాజ, సమున నెదురేగి యల్లంత సంయమీంద్రుఁ
గాంచి కైదండయును బాదుకలును వదలి, హర్షభయభక్తివినయంబు లతిశయిల్ల.

99


క.

గోత్రప్రవరలు నొడువుచు, గోత్రేంద్రుఁ డురోవిలిప్తకుంకుమపంకా
చిత్రితధాత్రీతలుఁ డై, తత్రభవన్మౌనిరాట్పదంబుల కెరఁగెన్.

100


సీ.

రాజితాష్టాంగవజ్రచ్చటాచకచకల్ పొదలి ప్రక్షాళనాంబువులు గాఁగఁ
గమనీయతరమౌక్తికశ్రేణిధళధళల్ నవకుందసుమపూజనంబు గాఁగ
నిర్దోషనీలమాణిక్యాళినిగనిగ ల్మంజుళధూపధూమములు గాఁగ
రమణీయతరపద్మరాగధగద్ధగ ల్నలువొందు నీరాజనంబు గాఁగ


తే.

భ్రమరఘంటారవాన్వితప్రసవదామ, సుమరసం బుపహారమై సొంపు నింప
మనుజపతి కన్న మున్ను దన్మౌళిమౌళి, మౌనిమౌళికిఁ బూజావిధాన మొసఁగ.

101


చ.

“శ్రీరస్తు క్షితినాథ తే” యని మునిశ్రేష్ఠుండు దీవింపఁగా
నారాజన్యుఁడు లేచి [1]సంభ్రమముతో నమ్మౌనిచూడామణి
న్రారాజన్మణిపీఠిపై నునిచి యర్ఘ్యం బాదియౌ పూజచే
నారాధించి ప్రహృష్టమౌనిఁ గని ధన్యం మన్యచిత్తంబునన్.

102


మ.

వ్రతితిలకా భవత్పదపరాగము సోఁకఁ బవిత్రమయ్యె నా
యతనము మిమ్ముఁ గొల్వఁగఁ గృతార్థుఁడ నైతి ఫలించె నింక నా
యతనము లెల్ల నాంతరతమోపహనూరులు గారె మీరు సం
తతశుభదాయకంబులు గదా మహదాగమనంబు లెయ్యెడన్.

103


మ.

శతవర్షంబు లరోగదివ్యతనులై సామ్రాజ్యసంపన్ను లై
సుతులం బౌత్రుల మిత్రులం గని కడున్ శుద్ధాత్ములై యందనా
హతమౌ మోక్షము గాంచ నేది సులభోపాయంబు నా కానతి
చ్చి తగన్ ధన్యునిఁ జేయు మీ చరణము ల్సేవింతు మౌనీశ్వరా.

104
  1. సమ్మదముతో