పుట:Dashavathara-Charitramu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విరిసోన గురిసె మొరసె, న్సురదుందుభు లపుడు మిగులఁ జోద్యము లనుచుం
బరితోషంబున వేలుపు, దొర లెన్నిరి వందిమాగధులవలె నంతన్.

91


క.

జమదగ్ని యొసఁగె రామున, కమితభుజాబలము సంగరాంగణవిజయం
బమరనరాజేయత్వము, నమరత్వము లోనుగాఁగ నఖిలవరములున్.

92


క.

హరశిష్యుండై సురరిపు, హరణం బొనరించి శివుదయన్ దివ్యాస్త్రో
త్కరముఁ గని గుహునిపై మ, చ్చరమున భేదించెఁ గ్రౌంచధర మొకకోలన్.

93


సీ.

అంతటఁ గార్తవీర్యార్జునుం డొకనాఁడు వేఁటలాడఁగ వచ్చి విపినవాటి
గజగండభేరుండఖడ్గాదిదుష్టసత్వములను ఖండించి శ్రమము మించి
జమదగ్ని యాశ్రమస్థలముఁ బ్రవేశించి యతఁడు విందొనరింప నారగించి
కామధేనువుఁ గాంచి కలుగదొకో యిట్టి యావు నావంటిజనాధిపతికి


తే.

నంచు నెంచుచుఁ బురమున కరుగ నతని, చిత్త మెఱిఁగి కుమారు లుద్వృత్తు లగుచు
రాముఁ డట లేనివేళ నాశ్రమము సొచ్చి, కామగవిఁ దెచ్చి తమయింటఁ గట్టికొనిరి.

94


శా.

ఆవార్త ల్విని భార్గవుండు పటురోషావేశసందీప్తనే
త్రావిర్భూతహుతాశనప్రభవధూమాకారఫాలస్థల
వ్యావల్లద్భ్రుకుటీమహోగ్రుఁడయి దోరంచత్కుఠారంబుతో
వే వచ్చె న్నగరాటవీజనపదాన్వేషంబు గావించుచున్.

95


చ.

అల గాధేయుఁడు చక్రవాళకులశైలాంభోధిదేవాప్సరో
లలనాదిప్రతిసృష్టి చేసె నన సాలంబు ల్మహాసౌధరా
జులు ఖేయంబు నృపు ల్సుతు ల్మొదలుగా సొంపొందు మాహిష్మతిం
దిలకించెన్ భృగురాముఁ డద్భుతరసోన్మేషానిమేషంబుగన్.

96


మ.

కని యౌరా కృతవీర్యనందనునిభాగ్యం బంచుఁ దద్గోపురం
బున నుగ్రాకృతి నిల్వ నచ్చటిజనంబు ల్పర్వుతోఁ బోయి య
ర్జునభూభర్తకుఁ దెల్ప నాతఁడు గడుం జోద్యంబుతోఁ దోడితె
మ్మనుచు న్నైజపురోహితుం బనుప నయ్యార్యుండు శీఘ్రంబునన్.

97


తే.

ఎదురుగా వచ్చి నృపతి మిమ్మిపుడు తోడి, తెమ్మనియెఁ బ్రేమ భృగురామ రమ్మటన్న
భార్గవుఁ డనర్గళాగ్రహభర్గపటిమ, నిట్లనుచుఁ బల్కె నృపపురోహితునితోడ.

98


క.

మే మేటికి వచ్చెద మటు, కామగవిం దెచ్చి యొసగు గ్రక్కున ననినన్
భూమిసురుఁ డెఱిఁగి ధరి, త్రీమండలపతికిఁ దెల్ప ధీరత నతఁడున్.

99


క.

తనయులకుఁ జెప్పి పంపిన, విని వార లొసంగ మనిన విభుఁడు సుతులఁ గా
దనలేక గోసహస్రము, వినయంబున నొసఁగఁ బనుప విప్రుఁడు నటులున్.

100