పుట:Dashavathara-Charitramu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దాసినై పరిచర్య సేయుటకు ననుగ్రహింపుం డని పునర్వందనంబు చేసి కరగత
పరశుధారాభీముం డగుపరశురాముం గనుంగొని కుమారకా క్షణభంగురం
బైన యీశరీరంబునకుఁగా విచారంబు వలదు జనకవాక్యోల్లంఘనంబున రుక్మ
వదాదు లిట్లయిరి గదా నీవైన జనకవాక్యప్రతిపాలనంబున దీర్ఘాయుష్మంతుఁడవై
కులంబు నిలుపుమని రేణుక పద్మాసనాసీనయై పుత్త్రా యన్యుల నియమింపక నా
పతి నిన్ను నియమించి మేలు చేసెఁగనుక చెదరక ధారదప్పక యొక్కపెట్టునం దె
గనఱకు నీనరుపు సూతమను మాత తెగువ సూచి తల్లి తెగనఱకుమంచుఁ బెంచి
తివే యీ చేతులంచుఁ బలపలకన్నీరు నించి యొడలు గడగడవడఁక జమదగ్ని దు
రాగ్రహదుర్గకుం బలివెట్టుచందంబున నెట్టకేలకు గేలికుఠారంబున రేణుకశిరం
బు గఱుక్కనం దెగనఱికినఁ దలమిడిసి యల్లంతటంబడియెఁ దత్కంఠనాళంబున
జుల్లున రక్తంబు వెడలునప్పుడు హాహాకారంబులు సేయువారును రేణుకవలన నే
మిపాపం బిది యధర్మం బనువారును నిట్లయిన స్త్రీల కింకఁ బాతివ్రత్య మతిదుర్లభం
బనువారును ఋషుల కింతరోషంబు చెల్లునే యనువారును పరశురాముం డతి
క్రూరకర్ముండు పొమ్మనువారును రాముం డేమి సేయుఁ దండ్రి సెప్పినయట్లు సేసె
ననువారును దండ్రి ముది ముది తప్పు సెప్పిన నకార్యంబు రామునకుం జేయఁద
గునే యనువారును జేయకున్న నన్నలపా టొందఁడే యనువారును నెట్టిపా టొం
దినఁదా నేమి యిట్టి క్రూరకర్మంబున కొడిగట్టఁదగునే బ్రాహ్మణున కనువారును వీ
రెక్కడి బ్రాహ్మణులు జన్మాంతరంబున బోయ లనువారును బోయలైనం దమవారిం
దెగఁజూతురే యనువారును నిట్టియుత్కృష్టకర్మంబున జమదగ్ని కిచ్చటనె యను
భవంబునకు రాకపోవునే యనువారును జమదగ్ని సర్వజ్ఞుం డతఁ డెఱుఁగడే
యిది యెట్టి ధర్మసూక్ష్యంబో యనువారు నైరి యయ్యాశ్రమవాసు లయ్యెడ
గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులతోఁగూడ బ్రహ్మరుద్రేంద్రాదు లంబరంబున
నిల్చి యాసాహసకర్మం బద్భుతం బని చూచుచుండి రయ్యవసరంబున.


చ.

బళిబళి నిన్ను మెచ్చితి నపారభుజాబలధామ రామ నీ
వలయు వరంబు వేఁడు మనివారణ నిచ్చెద నన్నఁ దండ్రిప
జ్జలజములందు వ్రాలి మునిచంద్ర యొసంగుము జీవితంబు ల
న్నలకును నాదుతల్లి కనినం జమదగ్ని ప్రహృష్టచిత్తుఁడై.

88


తే.

వారివారితలలు వారివారికబంధ, ముల నమర్పఁబంచి మునివరుండు
గరకమండలూదకములు పైఁ జల్లిన, సుతులతోడ బ్రతికె సతియు నంత.

89


ఉ.

నిద్దురవోయి లేచుగతి నీరజలోచన లేచి నవ్వులే
ముద్దుమొగంబుతోఁ బతికి మ్రొక్కి పదానతులైన పుత్త్రులం
దద్దయుఁ గౌఁగిలించి మునిదారలతోఁ దగ సుద్దులాడుచున్
నిద్దపువేడ్క నందఱను నివ్వెరపాటున ముంచె నత్తఱిన్.

90