పుట:Dashavathara-Charitramu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మును దాను గడకుఁ బోయినదినం బాధిగాఁ దెచ్చుక దినమును దినము లెన్ను
మధురము ల్ప్రియమైన మాని భోజనవేళ సారెకు నావపచ్చళ్లు మెసవుఁ
దుఱుమున నొకపువ్వు దుఱుము నెచ్చెలియోర్తు తెఱవ పుష్పవతి వైతి వన బ్రమయు
నలవోకఁ దొడమీఁదివలువ కుంకుమకఱ్ఱ గనుఁగొని తొలఁగితి ననుచుఁ దొలఁగుఁ


తే.

దెలిసి కాకున్న వగచు నజ్జలరుహాక్షి, యంత నెలయైన ఋతువైన యాత్మజయును
దాను మూన్నాళ్లు మూఁడేండ్లుగాను గడపి, నాలవదినంబునందు స్నానములు చేసి.

53


వ.

నిబ్బరంబగు నబ్బురపు సంతసపు కబ్బినుబ్బి తబ్బిబ్బగు నబ్బిబ్బోకవతులు రుచికుం
డాడినక్రమంబు వోనాడి వాఁడిచనుమొనలు గాఁడిపాఱఁ బుడమిఱేనిపూఁ
బోఁడి మేడియును రుచికమునిలికుచకుచ రావియును గౌఁగిలించి పసుపాడిన
రాచిల్కలవడువున నడివీథి నడతేరునపుడు తమరాక మునుగల్గ సౌవిదల్లులవలన
విని చంకలనిండ పసిబిడ్డలు గల్గుతల్లులు సరగమఱుఁగున కరుగ మందిరంబున కరిగి.

54


తే.

మౌనిపతి బ్రాహ్మనక్షత్రమంత్రములను, జరువు గావించి యటయుంచి సవిథ నదికిఁ
జనిన నావేళ మెసవిరి తనయచరువు, జనని జనయిత్రిచరువుఁ దత్తనయ పదరి.

55


ఉ.

అంతట మౌని వచ్చి యది యంతయు నాత్మ నెఱింగి కిన్కతో
గాంతరొ నీదుగర్భమున క్షత్రకులాంతకరుండు పుట్టెడి
న్శాంతిధనుండు బ్రహ్మఋషిచంద్రుఁడు పుట్టెడి నీదుతల్లికిన్
భ్రాంతిని నీ వొనర్చినవిపర్యయ మిట్లు ఫలించు నావుడున్.

56


చ.

భయపడి యంత సత్యవతి భర్తపదంబుల వాలి రాజహుం
డయినకుమారునొల్ల సదయాత్ము నొసంగు మటంచు వేఁడిన
న్దయ ముని నీసుతుండగు నుదాత్తుఁడు దత్తనయుండు ఘాతుకుం
డయి జనియించు నీజననియందు మహర్షివరుండు పుట్టెడిన్.

57


క.

అని పల్కిన ముదమందిరి, వనితామణు లంత సత్యవతి జమదగ్నిం
గనియె జగత్త్రయసజ్జన, వినుతుని నృపపత్ని గనియె విశ్వామిత్రున్.

58


శా.

విశ్వామిత్రుఁ డమిత్రభీకరభుజావార్యం బవార్యంబుగా
విశ్వం బేలి వసిష్ఠమౌనిపతితో విద్వేషియై యంతట
న్శశ్వద్బ్రహ్మఋషిత్వముం గనియె సాక్షాద్బ్రహ్మదేవాగ్రణీ
విశ్వేశాదులు సన్నుతింపఁగ జగద్విఖ్యాతశీలంబునన్.

59


క.

జమదగ్నిమునియు సకలా, గమనిగమపురాణశాస్త్రకలనాచణుఁడై
శమదమయమనియమాదిమ, సమధికగుణశాలి యగుచు సన్నుతి కెక్కెన్.

60


వ.

అక్కాలంబున.

61


క.

రేణుకభూపకుమారి క, రేణుక గుణగణనగణ్య ఋక్షధరిత్రీ
రేణుకగతి జితసమదక, రేణుక విలసిల్లు రూపరేఖలకలిమిన్.

62