పుట:Dashavathara-Charitramu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కన్య నినుఁగన్న కతమున ధన్యమయ్యె, నాకులంబంతయును నైన నాకులంబు
గాకమానదు నామది నాకుబలెనె, నీకుఁ దనయుండు లేమికి నీరజాక్షి.

41


క.

పతి వేఁడికొనుము పుత్రుని, నతులతపోన్వితుఁడుగాన నతఁ డొసఁగెడియా
సుతుఁ డుభయకులంబునకుం, గతి యొసఁగెడి ననుచుఁ దెల్పి క్రమ్మఱఁ జనియెన్.

42


ఉ.

బాలిక నాఁటి రేయి పతిపజ్జకుఁ బోయి పయింటకొంగు కెం
గోల బిగించుచు న్నెలను గేరెడు లేనగుమోము వంచి వా
చాలతఁ జూపలే కిగురుచాయల మోవి గదల్పుచున్న నీ
లాలక చెట్టపట్టి తనయంకమునం దిడి మౌని యిట్లనున్.

43


తే.

యేమి యడుగంగ వచ్చితి వింతలోన, సిగ్గుపడ నేల తెల్పవే చిగురుఁబోఁడి
యెద్దియైన ఘటించెద నే నటన్న, జననివాక్యంబు సతి దెల్ప మునివరుండు.

44


క.

కని పెంచువయసు గాదే, తన కేటికి లేక పోవుఁ దనయుం డిఁకనీ
కును నీజననికి నుత్తమ, తనయులు గల్గుటకుఁ జర్వుఁ దగఁ గావింతున్.

45


క.

అని యున్నతఱిని భృగుముని, సనుదేరఁగ రుచికమౌని సతిమణికలశం
బునఁ బన్నీరము వంచఁగ, జనకుని పాదములు గడిగి సంతస మెసఁగన్.

46


తే.

చౌకమై మించు దంతంపుఁజవికెలోన, రత్నమయపీఠిపై నుంచి ప్రకటభక్తి
పొసఁగ బంగారుపువ్వులఁ బూజ సేసి, వినయమున డాసి వీవన విసరుచున్న.

47


ఉ.

వేడుక మీఱఁగా విభుని వీవన గైకొని చల్లతెమ్మెరల్
గూడఁగ మెల్లనే విసరు కోడలి వల్లభభక్తి యెందునుం
జూడని సద్గుణంబులును జూచి ముదంబున నమ్మునీంద్రుఁ డి
ట్లాడె వధూమణీ యడిగినర్థ మొసంగెద వేఁడు మీ వనన్.

48


క.

వనజముఖి పలుకకున్నం, దనతల్లికిఁ దనకు మంచితనయులు వలెనం
చును వేఁడె నిన్న రే న, న్నని రుచికుఁడు దెల్ప సతి త్రపాన్విత యగుచున్.

49


తే.

తలఁగిపోయిన భృగుమౌని తనయుఁ జూచి, యాత్మజులు గల్గుటకు నుపాయంబు దెల్పి
శముల కేటికి నృపనివేశములఁ బుత్రుఁ, బడసి వని నుండు మీ వని పలికి చనిన.

50


ఉ.

అంతట భార్గవుండు తనయంగనఁ గన్గొని సి గ్గి కేటికే
యింతిరొ నీదుకోర్కి ఫలియించెను నీజనయిత్రి నీవు ఋ
త్వంతమునందుఁ బిప్పలము నత్తియుఁ గౌగిట నొత్తి రండు నా
చెంతకు నీకు నేఁజరువుఁ జేసి యొసంగెద నంచుఁ బంచినన్.

51


క.

సరభసముగ సత్యవతీ, తరుణీమణీ యవ్విధంబుఁ దన కెఱిఁగింపం
బరితోషంబున నరవర, సురపతిసతి ఋతువు కెదురుసూచుచు నెలమిన్.

52