పుట:Dashavathara-Charitramu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్సామాన్యంబు తపోవిశేషమేకదా జామాత యయ్యె న్భళీ
యీమౌనీంద్రుఁడు నాకు నాకులము యెంతే పావనం బయ్యెడిన్.

25


తే.

అనుచు ముదమున మునిఁ దోడుకొనుచుఁ బురము, సేరి పురమెల్ల మిగులఁ గైసేయఁ బనిచి
వేగ మౌహూర్తికులను రావించి లగ్న, నిర్ణయము చేసె గాధిభూనేత యంత.

26


సీ.

చెలువ యొక్కతె నూనె చిలికించి జడ విప్పి నిదురరాఁ దలయంటె నేర్పు మీఱఁ
జెలియోర్తు కుంకుమ నలుగిడె భసితావలిప్తదేహము హేమదీప్తి మెఱయ
గంధ మిందేలన గందంపు టటకలిఁ బెట్టె నవ్వుచు నొక్కబిసరుహాక్షి
యుష్ణాంబువు లటంచు నొడ్డుకోఁ గోర్వెచ్చజలముల నొకకల్కి జలకమార్చె


తే.

చలువ లందిచ్చె నొకచెల్వ వెలఁది నవ్వు, లుత్తరీయము లందుఁ జేనొడియ మాల్య
భూషణంబులఁ గైసేసెఁ బొలఁతి యొకతె, రాజులమె యంచు నమ్మునిరాజు సెలఁగ.

27


తే.

ఇవ్విధంబున రుచికమునీంద్రచంద్రుఁ, బెండ్లికొడుకును జేసినఁ బ్రేమమీఱఁ
గన్యకామణి సకలశృంగారములను, చెలులు గైచేసి రటమున్ను చెలువుమీఱ.

28


సీ.

అట గాధిభూపాలుఁ డత్యంతముదముతో జాతిముత్యపుపెండ్లిచవికెలోనఁ
దోరమై మంగళతూర్యఘోషంబులు భూనభోంతరముల బోరుకలఁగఁ
బాటలగంధులు పాటలు పాడంగ మమతతో రుచికుపాదములు గడిగి
మధుపర్క మొసఁగి సమ్మతి సత్యవతిఁ దనపుత్రికామణి ధారవోసి యిచ్చి


తే.

యంత నాల్గుదినంబులు నైనపిదప, భూరిమణివస్తువాహనభూషణంబు
లరణముగ నిచ్చి యల్లుని నాఁడుబిడ్డఁ, దనపురంబున నిల్పఁ జిత్తమునఁ దలఁచి.

29


మ.

అనఘా మానసశుద్ధి గల్గిన నరణ్యానిం బ్రవర్తిల్లుట
ల్గనకాగారమునందు నుంట సరియేకాదే తమోదూరుఁడై
జనకుం డేలఁడె భూమి మీ రటులు నస్మత్పట్టణాభ్యంతరం
బునఁ గొన్నాళ్లు వసించు టొప్పదె యన న్భూమిసురుం డిట్లనున్.

30


ఉ.

మంచిది సార్వభౌముని కుమారికకు న్వనవాసఖేద మె
ట్లించు నటంచు నెంచి వసియించెద [1]నట్లనె దీన నేరమే
మంచుఁ దదీయపట్టణమునం దొకకాంచనమందిరంబునం
జంచలనేత్రతోడఁ బతి సల్పె సమస్తగృహస్తధర్మముల్.

31


చ.

గురుకుచకుంభము ల్గదలఁ గ్రొవ్వెద జాఱఁ గడాని కమ్మక్రొ
మ్మెఱుగులు దళ్కుచెక్కులను మించ మిటారపుఁగల్కి చూపులం

  1. నట్లగుఁ గాక నేరమే