పుట:Dashavathara-Charitramu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వీక్షించినపుడె తెలిసెన్, లక్షణవతియంచు రాజనందనిహస్తం
బీక్షించి తపసి సతియగు, లక్షణమున్నయది నాతలఁపు చేకూరెన్.

7


క.

కన్యార్థి నగుచు వచ్చితి, ధన్యా నీయింటికడకుఁ దడయక నాకుం
గన్యాదానము చేసి య, నన్యాదృశసుకృత మొందుమా నృపసోమా.

8


వ.

అని పలికిన జడదారిపలుకులు ములుకులై చెవినాటిన నుల్కిపడి యప్పు డప్పు
డమిఱేఁడు తనమనంబున.

9


తే.

ఆకునలము మెసవి యడవిలో వసియించు, తపసు లేడ రాజతనయ లేడ
నందు నించుకైన నెంచక యక్కటా, యడుగవచ్చె నిట్లు వెడఁగుఁదపసి.

10


తే.

ముక్కుననె యుండుఁ గోపంబు మునుల కెల్లఁ, జెల్లఁబో యీయన శపియించిన శపించు
నటులుగావున నొకయుపాయమున దీనిఁ, గడపెదనటంచు నిట్లను గౌరవమున.

11


మ.

అమలాత్మా నినువంటి ధన్యునకుఁ గన్యాదానముం జేయుభా
గ్యము సామాన్యమె యైనఁ జంద్రధవళాంగశ్యామకర్ణాగ్రవా
హముల న్వేయి నొసంగఁగావలయుఁ గన్యాశుల్క మస్మత్కుల
క్రమ మీరీతి నొసంగి కైకొను మిదే కన్యామణి న్నావుఁడున్.

12


చ.

వెలవెలఁబోవు మోమునను విప్రకుమారకుఁ డౌర యెవ్వరుం
దలఁపరు తొల్లి యీతలఁపు ధారుణిలోపల నిట్టిగుఱ్ఱము
ల్గలుగునె గల్గెనా యొకటిగా పదిగావు సహస్రవాహము
ల్గలుగునె యేమి సేయుదును గన్నియఁ జూచిన నాస యయ్యెడిన్.

13


మ.

అనుచు న్నెమదిఁ గొంతచింత యిడి రాజా మంచిదే తెత్తునం
చని యంపించుక భూమిఁగల్గు సకలక్ష్మాధీశుల న్వేఁడి యెం
దును దాదృక్తురగంబు లేక మదిలో నూల్కొన్న చింతాభరం
బున నిట్లంచుఁ దలంచె మౌని యపరాంభోరాశితీరస్థుఁడై.

14


సీ.

నెఱివేణిఁ గూడని నెఱులు నెన్నుదుటిపై కమ్మకస్తురితిలకమున నెరయఁ
దెలివాలుగనుకెలంకుల సానదేఱెడి చికిలిచూపు లొకింతసిగ్గు గులుక
గోట నొక్కిన పాలుగాఱుకెంజెక్కుల నుదిరికమ్మలకాంతి యుదుటుసూప
నొరులచూ పొరయుచో నుసిరికాయమెఱుంగుచన్నుల పయ్యెదచాటు కొసఁగఁ


తే.

గొమరుప్రాయంబునను ముద్దుగులుకుచున్న, కన్నెఁ జూచిన మొదలు నాకన్నుఁగవకు
నిదుర గాన హయంబుల నెమకి గాన, గాన నీచింత దరిఁ జేరు క్రమము గాన.

15