పుట:Dashavathara-Charitramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. భృగురామావతారకథ

షష్ఠాశ్వాసము



ధవకథాసుధారస
మాధుర్యాధీనహృదయ మగదలకులపా
థోధికళానిధి సకలక
ళాదికనైపుణ్య కృష్ణయార్యవరేణ్యా!

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమాని
ధరణివర భృగురామావతార మిఁకను
దెలియఁజెప్పెద వినుమని తెలుపఁ దొడఁగె.

2


శా.

శ్రీకాంతోజ్జ్వలదంతవాస మలకాక్షీణప్రభావాప్తము
ద్రాకారాజవిరాజమానముఁ గళారమ్యంబు శుద్ధద్విజా
లోకం బుత్కటహేమధామవర వల్గుస్ఫూర్తి చిత్రంబు క
న్యాకుబ్జంబు కకుబ్జనస్తుతినిఁ జెల్వంబౌ ముఖాబ్జంబునన్.

3


ఉ.

ఆపుర మేలు గాధి మనుజాధిప శైలనిరోధిబాధితా
టోపవిరోధిసాధితకఠోరధరాంతపయోధియూధికా
భాపటుకీర్తిశోధితకపర్దిశిరోధి సమేధితాత్మమే
ధాపరిపూరితాంబుధి సుతాగృహమేధి మహాశ్వమేధియై.

4


చ.

అతఁ డొకనాఁడు వేడుక నొయారులు గొందఱు గొల్వుసేయఁగా
రతనపుమేడ నున్నతఱి రాఁగరుచీకుఁడు చారుభక్తితో
నతిథిసపర్యలం బ్రముదితాత్మునిఁ జేసి మణీమయాసన
స్థితు నొనరించి తా నతనిచెంత వసించె వినీతి నత్తఱిన్.

5


తే.

పడుచుఁదనమునఁ బైపక్కఁ బడుచునున్న, పడుచునొక్కతె వేడుకపడుచుఁ గాంచి
రాజ యీకన్య నీకూఁతురా మఱేమి, భాగ్యశాలివి సకలసంపదల నీవు.

6