పుట:Dashavathara-Charitramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వాసవదంతి దంతములు వల్ల దిభాస్యున కొంటికొమ్ము గాఁ
గా సరిపోవ దేకరణిఁ గాంతకు దంతపుఁ బావలిత్తునం
చాసను గ్రుమ్మరం గలిగె నాదివరాహమ నీదుకొమ్ము నేఁ
జేసిన యత్నము ల్ఫలము జెందెను తావకదర్శనంబునన్.

208


ఉ.

వీరుఁడ వంచు నిన్నుఁ బదివేలవిధంబులఁ బ్రస్తుతించుచు
న్వారిధిభర్త దెల్ప విని వచ్చితి మెచ్చెద నేఁడు చూపు నీ
వీరతఁ గాందిశీకపద వీరతవృత్తిని మోరత్రోపునం
బాఱెదనన్నఁ బోవిడఁడు స్వర్ణవిలోచనుఁ డంచు నుగ్రుఁడై.

209


ఉ.

దండము పెట్టఁగా సురవితానము లందును భక్తిసేయకన్
దండము బెట్టుగా విసరి దైత్యుఁడు వేసినఁ బొందెతూఁట వే
దండముఁ దాఁకినట్లు కిటి దాఁకి యదంతట ఖండమైన కో
దండముఁ బూని వాఁడు నిశితప్రదరంబులు గాఁడనేయఁగన్.

210


తే.

సెలసి కొట్టిన కిటికోఱ జీరవారి, కనకనయనునిబలుమేనఁ గాననయ్యె
వలపు మీఱఁగ నిడు మృత్యువనరుహాక్షి, వాఁడికొనగోఁట జీరె నా వసుమతీశ.

211


వ.

అంత.

212


మ.

శునకంబుంబలెఁ జుట్టుముట్టుకొను రక్షోవీరు దంష్ట్రాహతిం
దునుక ల్చేసి తేదీయసైన్యములఁ బొందు ల్వాపి తద్రక్తసి
క్తనవీనాంబుధి నోలలాడుచును భూదారేంద్రుఁ డెప్పంటిమే
రను దాల్చెన్ సురలెల్ల గోరఁ దనకోఱ న్ధారుణీమండలిన్.

213


సీ.

తమ్మికన్నుల మరందముదశ్రువులు జాఱ నెలదేఁటిచూపులు బెళుకుఁజూప
శైలవక్షోజము ల్ఝర ఘర్మమున దోగి మబ్బువన్నియపైఁట మాటుకొనఁగ
నబ్జాకరాస్య మోహనభంగవిభ్రమభ్రూవిలాసంబులు పొల్పు మిగుల
మహితనితంబబింబము నొరయుచు యమునావేణి వెనుచాయ నటన దెల్ప


తే.

రంధ్రనాభియు వనరోమరాజి మెఱయఁ, దనులత చలింపఁ గపటభూదారకాంత
దంతకోరకఘట్టితాధర నవోఢ, వసుమతీకాంత యానందవార్ధిఁ దేలె.

214


మ.

పరికింపం గిటికోఱ దంతమయ దీపస్తంభమై యొప్పె పై
పరిశోభిల్లెడుధాత్రి పాత్రవలెఁ జూపట్టెం దదగ్రాల్పపు
ష్కరముల్ తైలములీలఁ బొల్చెఁ గనకగ్రావంబు దీపంబువై
ఖరిఁ బెంపొందెఁ దదంతదీపశిఖవీఁక న్మించె మేఘాళియున్.

215