పుట:Dashavathara-Charitramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

త్వరగాఁ బోయెద వేమికార్య మనినం దైత్యుండు నేఁ బోరికి
న్వరుణుం బిల్చినఁ బోరఁజాలక హరిన్ వర్ణించినం బోయెదన్
హరి వైకుంఠమునం గలండె యన నాహా యిట్టి నీవార్త ముం
దరగానే విని ఘోణియై చనియెఁ బాతాళంబునం దాఁగఁగన్.

199


తే.

ఎందుఁబోయిన బోవ నీ కిపుడు నీవు, వెంటనే పోయి గెలువు మవ్విష్ణు ననుచుఁ
బలుక నారదమౌని నీపాదమాన, పోవనీ నంచుఁ బాతాళమునకు నరిగి.

200


మ.

కనియెం దానవసార్వభౌముఁ డెదుట న్గంభీరపాథోధిమ
ధ్యనిమగ్నావనిభారసంవహనదంష్ట్రాంకూరమంచచ్ఛర
ద్వనభృద్గౌరము వజ్రసారకృతసంధానాంగరుడ్వారమున్
స్తనితాభీలరవానుకారము మహోదారంబు భూదారమున్.

201


వ.

ఇట్లు కనుంగొని.

202


తే.

నాకచరవైరి శౌరి హా పోకుపోకు, మిదిగో వచ్చితి నెందు వోయెదవు పంద
తిరుగుతిరుగు మటన్న నుద్వేలరోష, రసభరంబునఁ గుహ నావరాహ మపుడు.

203


తే.

కోఱఁ దనరారు ధరణీచకోరనయన, వారిరాశిని దేల్చె నవారితాత్మ
శక్తి యాధారముగఁ జేసి శక్తినాథ, ముఖులు నానాబృహద్భానుముఖులు వొగడ.

204


తే.

పర్వతారాతి గురిసె ముద్బాష్పమేఘ, పుష్పవృష్టికిఁ దోడుగాఁ బుష్పవృష్టి
పర్వతారాతి భాస్వరప్రభల నజయ, దానవోత్పాతమునకు నిదాన మయ్యె.

205


వ.

ఇవ్విధంబున నవ్వరాహమూర్ధన్యుం డనన్యసామాన్యవిరోధిరమాన్యకార
మాన్యబలంబునం గువలయంబుం గువలయంబుచందంబునఁ గమలాకరంబు
నం దేలించి మదాభంగురమాతంగపుంగవసముత్తుంగబృంహితంబునం
గెరలు కొదమసింగంబు తెఱంగునఁ గిఱుక్కునఁ దిరిగి యిట్టట్టు సనక పులి
తోలుగట్టు వేలుపుగట్టువలె పీఁట వెట్టి ముట్టె బిగించి వెన్నుసట లుబ్బ సెలవులు
సప్పరించుచు వేఁడిమిడుంగుఱులు వొడమ నిడుదక్రొవ్వాడికోఱలు దీఁటుచు
దీర్ఘనిర్ఘాతఘర్ఘరముర్ఖురనిర్ఘోషంబుల బ్రహ్మాండభాండంబు పటపటం బగిలించు
జండ్రనిప్పులకరణి వేండ్రంబై తీండ్రించుచూపులం జుఱచుఱం గనుచుఁ
గదిసిన నసురపతి యట్టహాసంబు చేసి యిట్లనియె.

206


తే.

హరి వగుటఁ జేసి మును పంది వగుట నిక్కు, వంబు తుది నేఁడు నీవికారంబు నొంది
పంది వైతివి నేను సొంపంది యుందుఁ, బంది వేఁటాడుటకుఁ గోర్కి ఫలితమయ్యె.

207