పుట:Dashavathara-Charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యున్నవా రిది వారియావిర్భావసమయంబు గావున నఖిలలోకంబు లంధతమ
సమయంబులై యున్నయవి యింకఁ జతుర్భుజనిర్భరకరుణాతిశయంబున మీరు
నిర్భయులు గాఁగలరని హిరణ్యగర్భుం డానతిచ్చిన హవిర్భుఙ్ముఖులు యథేచ్ఛం
జని రంత.

171


తే.

శ్రీవిభుని నామ మెక్కడఁ జెవులఁబడునొ, యంచు మూసినచందాన హస్తపిహిత
కర్ణమై యుద్భవించె నాకశ్యపాగ్ర, దారగర్భంబునందు దైత్యద్వయంబు.

172


పంచచామరము.

ధరంబు లొడ్డగిల్లెఁ ద్రెళ్లెఁ దార లాఱె నగ్ని భా
స్కరుండు మాసె మ్రోసె జంబుకంబు లంబురాసు ల
బ్బురంబు గాఁగఁ గ్రాఁగి పొంగె భూమిఁ గ్రుంగె వాహినీ
ఝరంబు లింకెఁ గొంకెఁ బంకజాతసూతి యత్తఱిన్.

173


తే.

కశ్యపుఁడు వచ్చి కృతజాతకర్ముఁ డగుచు, నగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డని సహోద
రుఁడు హిరణ్యాక్షుఁ డనుచును రూఢి గాఁగ, నామకరణంబు గావించె నందనులకు.

174


వ.

అంతఁ బ్రతిదినప్రవర్ధమాను లగు దితిసూనులయం దగ్రజుం డగుహిరణ్యా
క్షుం డక్షీణబలంబున మించె నట్టియెడ.

175


సీ.

అంగుష్ఠమున నిల్చెనా కిరీటము దాఁకి పటపట బ్రహ్మాండభాండ మగలు
నట్టె చేతులు సాఁచెనా పూర్వపశ్చిమచంద్రదినేంద్రులఁ జంకనిఱుకు
వడిగాఁగ నాలుగై దడుగులు నడిచెనా ధారుణీతలము పాతాళ మంటు
నొకయింత ఘనముగా నొడ లుబ్బఁజేసెనా హరిదంతరము లెల్ల నవియఁబారుఁ


తే.

గడిఁది నిట్టూర్పుగాడ్పుల గ్రహగణంబు, లొక్కమూలకుఁ జిక్కు నత్యుగ్రదృష్టి
నిగుడుచోటెల్ల నిగుఱులై యెగయు నట్ట, హాస మొనరింప విధిగుండె లవియుచుండు
వానియౌద్ధత్య మెన్న నెవ్వారితరము.

176


మ.

అసురాధీశుఁడు రోహణాచల సముద్యద్రత్నముల్ సెక్కి ర
మ్యసువర్ణాద్రిని మౌళిఁజేయఁ బరభూషావాప్తికై ఫాలదృ
గ్వసుధాభృన్ముఖలోహముల్ పుటములై వ్రంద న్మణిప్రాప్తి క
న్ని సముద్రంబులు వెళ్లజల్లఁ దలఁచున్ మోహానురూపంబుగన్.

177


వ.

అంత నొక్కనాఁడు.

178


క.

జలరాసు లేడు నొండై, కలసిన జలకేళి సల్పఁగా నిమ్మగు నీ