పుట:Dashavathara-Charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆఁకొన్నసురలెల్ల ననుదినం బెవ్వరిక్రతుశాలపంచలఁ గాచియుండ్రు
భజియింతు రెవ్వారిభవనము ల్బ్రతిమాసమును బితృదేవత ల్భుక్తిగోరి
సకలభూతంబులు సంతృప్తిఁ జెందు నెవ్వరు సేయఁదగు బలిహరణసిద్ధి
నర్చావతారంబు లశ్రాంతమునుఁ బూజ లందు నెవ్వరిచేత నర్హరీతి


తే.

వేదశాస్త్రంబు లేరిచే వెలయుచుండు, నెంచు నెవ్వరిదినచర్య స్మృతిచయంబు
లర్క జయ మిచ్చు నెవ్వరియర్ఘ్యతోయ, మట్టివిప్రుల కెన యెవ్వ రఖిలమునను.

164


శా.

ఏమీనాక్షికటాక్షలేశమునకై యీశానవాణీశసు
త్రామాదు ల్భయభక్తియుక్తి నెపుడుం బ్రార్థింతు రాలక్ష్మి యెం
తోమోదంబునఁ జేరి పాయదు విరక్తు న్నన్ను నే భూసుర
శ్రీమాహాత్మ్య మెఱింగి కొల్వఁగఁ గదా సిద్ధించు నానార్థముల్.

165


మ.

అజమూర్థాపహవృత్రశాత్రవులు బ్రహ్మద్వేషము ల్సేయఁగా
నజహత్సంపద గాంచలేక కడుభిక్షావృత్తికి న్మర్త్యదై
త్యజనోద్వృత్తికిఁ జిక్కి పొక్కెదరు సత్యం బెందు విప్రావళీ
భజనాచారము లేనివారలకు సౌభాగ్యంబు చేకూరునే.

166


క.

అపరాధం బొనరించిన, కపటాత్ములఁ బుణ్యజనులు గండని కినుకన్
శపియించితి రన్నను మీ, కృప యెంతని పొగడుదున్ యతీశ్వరులారా.

167


చ.

సరసులు ఘర్మకాలమునఁ జండకరోష్ణము పైని బూని యం
తరముల శీతలంబు లగు దారి భవాదృశసాధుచిత్తముల్
పరిఘటితాపరాధములపట్టునఁ బైపయిఁ గిన్కఁబూనియుం
బొరయవు లోఁ గఠోరతఁ బ్రపూర్ణశమాఢ్యము లౌట నెప్పుడున్.

168


క.

వీరలు మీ కొనరించిన, నేరంబున ధరణిఁ బుట్టి నిశిచరు లగుచుం
బోరున నాచేఁ దెగి నం, జేరెద రని యతులఁ బంచి శ్రీపతి యంతన్.

169


సీ.

జయవిజయులఁ జూచి దయ నిటులను మున్ను యోగనిద్రాసక్తి నున్నవేళ
నాచెంత కరుదేర నళినవాసిని నడ్డగించిన మీపైని గినుకపూనె
నదియుఁ దప్పించితి నవనీసురులశాప మలవియె తప్పింప నవనిలోన
నిఁక మీరు దైత్యులై యేడుజన్మంబుల దాస్యంబుచే నీపదంబుఁ జేరఁ


తే.

గోరెదరొ జన్మములమూఁట వైరు లగుచుఁ, జేరెదరొ యన్న వారలు వైరముననె
చేరెద మటంచు మొక్కి కన్నీరు దొరుఁగ, విన్ననై విన్నవించిన వెన్నుఁ డపుడు.

170


వ.

అటు గావింపుఁడని యంగీకరించి యంగనాసంగతుండై భుజంగపుంగవశయ
నుం డంతఃపురంబున కరుగ సరగ జయవిజయులు సముద్రమేఖలకుం జని రుద్ర
భృత్యు లగు భద్రానుభద్రుల రౌద్రాంశంబులం గూడి దితిగర్భంబున నర్భకులై