పుట:Dashavathara-Charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అడుగు లొత్తెడు నప్పు డప్పుడమిపడఁతి, గబ్బిగుబ్బలయంగరాగంబు సోఁకె
ననరు కేంజిగిచరణంబు లంబుజములు, గానఁ బుప్పొడి యందురు మౌనివరులు.

156


తే.

భువనమోహనశృంగారపూర్ణ మగుచు, వెలయు హరిదివ్యమంగళవిగ్రహమున
మగ్నమై చిత్త మానందమయతఁ గాంచె, విషయవిక్షేపములు లేమి ఋషివరులకు.

157


తే.

మౌను లానందబాష్పాయమాననయను, లగుట నంతట నానతు లగుచు లేచి
బ్రహ్మ దెల్పినరీతి మీభవ్యమూర్తిఁ, గాంచి ధన్యులమైతిమి కమలనయన.

158


శా.

భేదాతీతుఁడవై జగన్మయుఁడవై పెంపొందు నీలీల సం
వాదం బే మొనరింప నేర్తుమె “యతో వాచోనివర్తంత” యి
త్యాదిప్రాక్తనసూక్తు లొప్ప మఱి యేమన్న న్మనఃపీఠి నీ
పాదద్వంద్వము నిల్పికొల్తు మనుకంపం బొప్ప సర్వేశ్వరా.

159


సీ.

పద్మరాగప్రభాభాసమానకిరీట మృగమదతిలకజృంభితలలాట
విపులనేత్రాభోగ విజితపంకజవర్ణ మకరకుండలదీప్యమానకర్ణ
మందహాసవిలాస మాధుర్యముఖపద్మ యిందిరాసందీప్తహృదయసద్మ
ఘనకటీతటబద్ధకాంచనకౌశేయ మణిమయదివ్యభూషణనికాయ


తే.

శంఖచక్రాదిసాధనసహితహస్త, యజ్ఞనిగ్రహరుచివిగ్రహప్రశస్త
మీకు మ్రొక్కెద శుభనామ మిహిరధామ, శిష్టజనపద్మమిత్ర లక్ష్మీకళత్ర.

160


ఉ.

శ్రీపతి తావకీనపదసేవనశీలుర ద్వారపాలురం
గోపము మీఱఁ దిట్టితిమి కుంభినిఁ బుట్టఁగ నింకనిట్టి బ
ల్పాషముచేత రౌరవము పాలయి కూలక యుండ మమ్ము మీ
ప్రాపున నుంచి ప్రోవుము ప్రసన్నజనావన లోకపావనా.

161


మత్తేభగర్భితసీసము.

వినతపద్మాసన విశ్వరక్షణచణా నాళీకపత్రేక్షణా రమేశ
సతతతేజోనిధి సజ్జనవ్రజనుతా తారుణ్యలక్ష్మీయుతా యుపేంద్ర
విజితమత్తాసుర విక్రమోజ్జ్వలభుజా శృంగారలీలానిధీ ముకుంద
మహితకార్యోద్యమ మమ్ముఁ బ్రోవుము దయ హేమాంబరాడంబరా మహాత్మ.


తే.

యని విచిత్రవచస్ఫూర్తి వినుతి సేయ, మౌనిమత్తేభవృత్తంబు మదిని మెచ్చి
యంబుజోదరుఁ డిట్లని యానతిచ్చెఁ, బ్రావృడంభోదగంభీరభాషణముల.

162


క.

ముక్తులును విరక్తులు భవ, ముక్తులు హృదయాంబుజాతముఖ్యగుణాళీ
ముక్తులు శాంతతనుత్రా, ముక్తులు మీ కేటికలుషములు మునులారా.

163