పుట:Dashavathara-Charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిల యేమి నడుమ ననుచుం, దలఁచి హిరణ్యాక్షుఁ డధికదర్పస్ఫురణన్.

179


మ.

నగరంబు ల్నగము ల్నదంబులు నరణ్యంబు ల్నదుల్ లోనుగా
జగతిం జిత్రపటంబు డంబు గనిపింపం జుట్టి చక్షుశ్రవో
జగతిం డాఁచె హిరణ్యనేత్రుఁడు తపశ్చర్యానపర్యాప్రహ
ర్షగభాషాహృదయేశదత్తవరదోస్పారంబు ఘోరంబుగన్.

180


మ.

చటులోచ్ఛ్వాసమరుత్పరంపరలచే సర్వంకషాభ్రంలిహ
స్ఫుటిమ న్మించు మహాపయోధిని సముద్భూతోరిజాతంబు లు
త్కటఘోషంబున ఘూర్ణిల న్ఘనగదాదండంబుచేఁ జెండుచున్
ఘటియించెం జలకేళి హాళిమెయి రక్షస్స్వామి యక్షీణుఁ డై.

181


క.

అది చాలక బ్రహ్మాండం, బుదితము గావించి బాహ్యమున నుదితం బౌ
నుదకమున నీఁదులాడఁగఁ, మదిఁ దలఁచుచు నుండె దితికుమారుం డధిపా.

182


వ.

ఆసమయంబున.

183


క.

స్వాయమ్భువమను వొకనాఁ, డాయంబుజభవునిఁ జేరి యతివయుఁ దాను
న్వేయువిధంబులఁ బొగడుచు, నేయనువున సుగతి గల్గు నెఱిఁగింపు మనన్.

184


క.

వనజాక్షుఁ గూర్చి జన్నము, లొనరించిన సుగతి గలుగు నొండేమిటిచేఁ
గననేర వనుడు నలువకు, మను వనియెం జోటు గాన మఖమున కనఁగన్.

185


ఉ.

ఔ నిది నిక్కువంబు గనకాక్షుఁడు ఘోరతపంబు చేసి నా
చే నవనీతలంబుఁ గొని చేర్చె నధోభువనంబునందు న
ద్దానవుఁ ద్రుంచి భూతల ముదారతరాంబుధిఁ నీరఁ దేల్చఁగా
[1]నేనె సమర్థుఁ డౌదుఁ బరు లెవ్వరు తద్ధర నుద్ధరింపఁగాన్.

186


క.

అని హరి దలఁచుచుఁ దనలో, నను చింత యొనర్చు బ్రహ్మనాసారంధ్రం
బునఁ గిటి యొక్కటి వెలువడి, యెను వడి నంగుష్ఠమాత్రదృశ్యాకృతితోన్.

187


ఉ.

అంతట హంసమాత్ర మయి యాపయి నుక్ష సదృక్షమై గజం
బంతయి యంతమీఁదఁ దుహినాచల మంతయి యీజగంబునా
ద్యంతముఁ దానయై సితసమంచితగాత్ర ముదారపోత్రమున్
దంతురదంష్ట్రలుం దనర దంభకిటీంద్రము దారుణంబుగన్.

188


మ.

ప్రళయారంభవిజృంభితాంబుధరగర్జాతర్జనప్రోజ్జ్వల
ద్గళగంభీరకఠోరఘర్ఘరలతో గర్జింప లోకేశము
ఖ్యులు వర్ణించిరి నైగమోక్తులను రక్షోరాడ్జిగీషావిశృం
ఖలలీలాత్తవరాహవిగ్రహు నమత్కంజచ్చటావిగ్రహున్.

189


వ.

అంత.

190
  1. నేనె సమర్ధుఁడం బరు లిఁ కెవ్వరు