పుట:Dashavathara-Charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శిక్షించు న్సత్పురుషుల, రక్షించుం గడలిఁ బొడమి ప్రబలినవిషమున్
భక్షించి జగముఁ గృపచే, వీక్షింపఁడె నీ వెఱుంగవే జలజాక్షీ.

55


మ.

అనిన న్మందమరుత్కిశోరకులలోలాకాశగంగాతరం
గనికాయంబులు దమ్మిపైఁ బొరలు పొంకం బెంతయున్ వింతగా
నునులేనవ్వు ముఖారవిందమునఁ జిందు ల్ద్రొక్క నక్కల్కి యి
ట్లనియెన్ యౌవనగర్వనిర్వహణలీలాలోలవాచాలతన్.

56


తే.

కుడువఁ గూడును కట్టుకోఁ గోక లేక, తోలు గట్టుక తిరుగు బిచ్చాలశివునిఁ
జాల వర్ణింపఁగా నేల చాలుఁ జాలు, నతని కొకకూఁతు నిచ్చి లోనడలుఁ దండ్రి.

57


తే.

చూడఁ దెడ్డును మంచముకోడు గాని, యేమిసంపద పార్వతి కీశ్వరునకు
మీరు దోఁబుట్టు వంచును మెచ్చుకొనిన, నిచ్చకంబుననైన నే మెచ్చుకొనను.

58


క.

జనకుఁడు పదుమువ్వురు మముఁ, గని మీప్రియుఁడైన వాసఁ గైకొనుఁ డన్న
న్నినుఁ గోరమె యన్నింటన్, ఘనుఁడవు గావునను గావునను రతి ననినన్.

59


శా.

“శాంతంపాప” మటంచు మౌనిపతి హస్తచ్ఛాదితశ్రోత్రుఁడై
యింతైన న్మదిఁ గొంకు లేక తగునే యీలాగు నిందింపఁగాఁ
గాంతా విశ్వజనీనవైభవమహాగంభీరశైలేంద్రజా
కాంతద్వేష మనాత్మనీనము గదా కన్గొన్న నెవ్వారికిన్.

60


సీ.

అఖిలలోకంబుల నధికుండ నేనంచుఁ గర్వించు విధిమస్తకంబుఁ ద్రుంచె
నధ్వగంబులఁ దన్ను నవమాన మొనరింప మీదక్షున కొసంగె మేషశిరము
పుష్పాస్త్రముల రక్తిఁ బుట్టింప గిట్టిన భస్మంబు గావించెఁ బంచశరుని
వ్యాసులు మును “నదైవం కేశవాత్పరం " బనిన బాహుస్తంభ మలవరించె


తే.

శౌరి నయనాంబుజమునఁ బూజన మొనర్ప, మెచ్చి చక్రం బొసంగె నమ్మేటిమగని
నెట్లు నిందించెదవె యొడ లెఱుఁగ లేక, దక్షపుత్త్రివి గనుక నోతరలనయన.

61


సీ.

దండధరోద్దండత నడంచు విషభోక్త యహిఫణామణు లూను నస్థిహారి
మసనంపుటిలు సర్వమంగళాధీశ్వరుఁ డైశ్వర్యశాలి యానాదిభిక్షుఁ
డతివకై యర్ధదేహ మొసంగు కామారి యాశ్రితసులభుఁ డైనట్టియుగ్రుఁ
డధ్వరఫలదాత యైనక్రతుధ్వంసి విపులారథికుఁడైన వృషభహయుఁడు


తే.

హరుఁడు శంకరుఁడును భవుఁ డభవుఁ డిందు
శితవిభానిథి నీలలోహితుఁడు నష్ట
తనుఁడు పంచాననుఁడు త్రిలోచనుఁడు నిర్గు
ణాత్ముఁ డద్దేవుఁ దెలియ శక్యంబె మనకు.

62


తే.

అనిన నట్టిదేవుఁ డంగజునకు లొంగి, సందెలందు దివములందు విడక
వేయువత్సరములు వెలఁదితో రమియించి, యర్ధదేహ మొసఁగఁడా యటన్న.

63