పుట:Dashavathara-Charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ప్రాణనాయక యొకముహూర్తంబు తాళు, మంచు నానతి యిచ్చితి రంత యేల
యొక్కక్షణ మొక్కదినమయి యున్న దిపుడు, తాళఁగాఁజాల మత్కాంక్షితంబు దీర్పు.

48


వ.

అదియునుం గాక.

49


సీ.

తల్లి దైవం బని తగుప్రదక్షిణనమస్కృతుల నింద్రాదులు సేవసేయ
నత్తగా రని బత్తినడుగు లొత్తుచు శచీవనజాక్షి కోడలితనము నెఱప
నవ్వ యంచును బ్రేమ నివ్వటిల్లగఁ జేరి మురిపెంపుమనుమఁడు ముద్దుగురియ
దివ్యవాద్యములతో దినదినంబు నికేతనంబున శుభశోభనములు నడువఁ


తే.

జుట్టఱికమున నిచ్చిపుచ్చుకొను బంధు, జాల మెంతయు గౌరవసరణిఁ జూడ
విభవముల విఱ్ఱవీఁగెడువిబుధమాత, నదితి గని యెట్లు దరియింతు [1]ననవరతము.

50


సీ.

అదితి గన్నకొమాళ్లయం దొక్కరుఁడు జగత్త్రయరక్షణాధురంధరతఁ బూనె
మఱియొక్కఁ డాకాశమణియై జగత్త్రయీమూర్తియై భువనసత్కీర్తి మించె
వినతాత్మసంభవుం డనుపమేయబలాప్తి వనజాక్షువిశ్వంభరుని భరించెఁ
గద్రుతనూజుండు గహననానాసముద్రాహార్యములతోడ నవని మోచె


తే.

మఱియు నీచెట్టపట్టిన మగువలందు, నెవ్వరికి లేరు సత్పుత్త్రు లెంచి చూడ
నందఱు నభీష్టసంపద నలరినారు, కాంత నాభాగ్య మిట్లయ్యెఁ గాని నేఁడు.

51


క.

రమణునిమన్ననవలనన్, రమణీమణి రమణనొందు రవిమన్ననచేఁ
గమలిని శశిమన్ననచేఁ, గుముదినివలె ననిన నతఁడు గోమలి కనియన్.

52


సీ.

విరియఁబోసినజటావిసరంబు కెంజాయ సాంధ్యరాగంబుపై చౌకళింపఁ
బ్రేతవనాయాతవాతనీతవిభూతినికరంబు నెమ్మేన నిండికొనఁగఁ
గృతతప్తసౌవర్ణగిరివిగ్రహంబైన ఘనవిగ్రహము భయంకరము గాఁగ
వికటాస్థిహారము ల్విషభరమాలికల్ గజచర్మవసనంబు గండుమిగులఁ


తే.

గేల శూలంబు పూని దిగ్భిత్తు లగల, నట్టహాసంబు చేయుచు నఖిలభూత
విసరములు గొల్వ మదమత్తవృషభ మెక్కి, రుద్రుఁ డీవేళ మెలఁగెడు రౌద్రముగను.

53


తే.

అనలచంద్రార్కనేత్రత్రయంబు దెఱిచి, చూచుచున్నాఁడు రోషస్పురణ దనర
మఱఁది యనుచుట్టఱికమున మాఱుమసల, వలదు దుర్మార్గులైన నెవ్వారి నైన.

54
  1. ఁ బ్రాణనాథ