పుట:Dashavathara-Charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనిన వల్లభ యీలీల నాడ నెంత, దాన నావంటివా రెందఱైనఁ గలుగ
నగ్రపత్నియటంచు న న్నాదరించి, మీరు నవ్విన వలదననేరఁగాని.

39


తే.

ఇంకఁ దాఁపఁగ నేల ప్రాణేశ వినుము, సిగ్గువడి యుండనీయఁడు చిత్తభవుఁడు
కన్నెగేదఁగిరేకుచేకత్తికొద్దిఁ, గ్రుమ్ముచున్నాఁడు దయలేదు కొంతయైన.

40


తే.

అటులు గావునఁ గామార్త నగుచు నిన్ను, శరణు వేడెద రక్షింపు సౌఖ్య మొసగి
యార్తజనరక్షణాదక్షు లఖిలభూత, సదయులును గారె మీవంటిసాధు లరయ.

41


మ.

అనినన్ లేనగ వంకురింప మునికాంతా యింతసంతాప మే
లను మాకుం బ్రియమైనకార్య మిది వాలాయంబుగా నేను జ
య్యన నీవాంఛిత మెల్లఁ దీర్చెదను సంధ్యావేళఁ బోనిమ్ము నా
వనజాతాక్షి స్మరేభమార్గణకరవ్యాధూతచిత్తాబ్జ యై.

42


సీ.

మలయాచలాయాతమందానిలము గాదు రణరంగసన్నధరథము గాని
ప్రాగస్తగిరుల చంద్రదివాకరులు గారు కమనీయకనకచక్రములు గాని
సాయంసముజ్జృంభసాంధ్యరాగము కాదు కొమరుఁజెంగావిటెక్కెములు గాని
సాధారణవిహంగసంరావములు గావు మణికింకిణులఘణంఘణలు గాని


తే.

తారకలు గావు దేవతాద్వంద్వముక్త, నవనమస్కారకుసుమబాణములు గాని
సంజగా దిది విరహిపై స్మరుఁడు దండు, వెడలు గోధూళిశుభలగ్నవేళ యధిప.

43


సీ.

తిలకింప ద్వాదశార్కులకన్న వేండ్రమై జలజారి పండువెన్నెలలు గాయఁ
బల్లవితాశేషపాదపచ్ఛాయలు విలయాగ్నికీలలవిధము చూప
మలయాచలాయాతమందమారుతములు ఝంఝామరుల్లీల సంచరింప
ఫలపుష్పనిష్యందిబహుమరందరసంబు వసుమతి నేకార్ణవంబు సేయఁ


తే.

గాలకంఠకఠోరహుంకారములను, దండిదండిని కుసుమకోదండి యడర
విరహిణీలోకసంహారవేళ గాని, యిది వసంతంబు గాదు ప్రాణేశ కంటె.

44


తే.

ప్రాణనాయక యిదె చూడు పతులఁ గూడి, పాయకుఁ డటంచు సతులకుఁ బల్కుతేజి
పాదుషాహు శికాచేసి పంపు కాగి, తంపుఫరమానువోలె సుధాకరుండు.

45


చ.

అళు కొకయింత లేక కుసుమాస్త్రుఁడు క్రొన్నెలసానదీరుచెం
గలువలకోరులం గులుకుగుబ్బచనుంగవ గాఁడ నేయఁగాఁ
గళగొనఁ గాఱురక్త మిదె గన్గొను కుంకుమ గాదు నాథ పూ
విలుతునిదుండగంబు దగవే సహియింపఁగ మాకు నిత్తఱిన్.

46


శా.

ఓయాత్మేశ్వర యీవసంతమున శాంతోష్ణాంశుసంతాపమున్
భూయోదృష్టతమం బధిజ్యధనురంభోజాస్త్ర ముద్యత్పటీ
రాయాతానిలశైత్యము న్విశదసర్వాంశంబు రమ్యంబు నౌ
సాయంవేళ రమింపవచ్చితి మది న్సంతోష ముప్పొంగఁగన్.

47