పుట:Dashavathara-Charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

కించిల్లక్షితదంతకోరకరుచు ల్కెమ్మోవిపై మించఁగాఁ
జాంచల్యాంచితలోచనాంచలము లజ్జాలీల సూచింపఁగాఁ
జంచచ్చూతదళగ్రసవ్యసనకూజత్కోకిలాపంచనా
చుంచువ్యాహృతి మీఱ నిట్లని వచించున్ బోటి గంభీరతన్.

30


తే.

అనవరతసౌఖ్యసంధాత యైననేత, కంటె దైవంబు గల్గునె కామినులకుఁ
గాన మీసేవ చేసి నాకాంక్షితంబు, ఫలితముగఁ జేయవచ్చితిఁ బ్రాణనాథ.

31


క.

మంచిది యటువలెఁ జేసెద, నంచానతి యిచ్చె దేని యది వినిపింతుం
గొంచక గాకుండిన భా, షించంగా వెఱతు నెంత చెప్పిన నధిపా.

32


క.

అని వనితామణి దెల్పిన, విని నవ్వుచు మౌనివిభుఁడు వెలఁదీ యీలా
గున సంశయింప నీకుం, జనునే నీమాట నేను జవదాఁటుదునే.

33


సీ.

అలసి వచ్చినవేళ నడుగు లొయ్యన నొత్తి విడె మిచ్చి సురటిచే విసరుటకును
నాఁకటఁ బడనీక యన్నపానంబులచేతఁ బ్రొద్దునఁ దృప్తి సేయుటకును
సంతరించినయట్టి సకలపదార్థముల్ దగులీల నింటిలో దాఁచుటకును
నతిథుల బంధుల నత్తమామల చిన్నిశిశువులఁ దెలిసి పోషించుటకును


తే.

ననవరత మగ్నిహోత్రంబు లరయుటకును, దేవపూజోపకరణము ల్దీర్చుటకును
బత్ని పాల్పడ గృహకృత్యభరములేక, గృహి యథేష్టంబుగా సుఖియించు నబల.

34


సీ.

సంసారసంభవాక్షయదుఃఖవారాశిఁ దరియింపఁగాఁ జేయుతరణి తరుణి
హృదయంగమస్ఫూర్తి నెపుడు నామోదంబు గలిగించుతావిచెంగలువ చెలువ
కామితఫలములు ఘటియించి వేలుపుఱేడు పెంచినచెట్టురెమ్మ కొమ్మ
కందొగ ల్నిత్యవికాస మొందింపఁగా మంచిపున్నమచందమామ రామ


తే.

సదనమణిమయదీపికాజ్వాల బాల, వల్లభమనోమదావళవారి నారి
శుభపరంపర వర్షించు సోన చాన, పృథులధర్మార్థమణిగణపేటి బోటి.

35


సీ.

అతిథుల నిష్టమృష్టాన్నతృప్తులఁ జేసి యనుదినంబును బుణ్యమందికొనుట
శాస్త్రోక్తపద్ధతి సవనముల్ సవరించి శ్రీహరి సుప్రీతుఁ జేసికొనుట
నన్యాశ్రమములయం దతిదుర్దమంబైన మన్మథోద్రేకంబు మాన్పికొనుట
నిజపితౄణము దీర్చి నిఖిలలోకంబులు పాలించుపుత్త్రులఁ బడయుటయును


తే.

గమలలోచన నీవల్ల గాదె యట్టి, నీకుఁ బ్రత్యువకారంబు నెఱఁపగలనె
యేను బదివేలజన్మంబు లెత్తియైన, మనసు వచ్చిన గతిఁ బనిగొనుము నన్ను.

36


తే.

దుర్గముల నాశ్రయించినదొర యరాతి, వర్గముల గెల్చువైఖరి వనిత నీదు
చారువక్షోజదుర్గముల్ చేరికాదె, కంతుశత్రు జయించెద గడియలోన.

37


క.

మహిఁ జతురాశ్రమములలో, గృహి యధికుం డట్టిగృహము నీవే “గృహిణీ
గృహముచ్యతే” యనందగు, మహితవచోరూఢి వినమె మదగజగమనా.

38