పుట:Dashavathara-Charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అకట తన కేమి కొదవ గేహమున సకల, భోగభాగ్యంబులును మంచిపువ్వుఁబోండ్లు
గలిగియుండంగ ననుభవకాల మెఱిఁగి, పడయనొల్లఁడు సౌఖ్యంబు వెడఁగుఁదపసి.

23


తే.

వలపు గలిగిన నిండుజవ్వనిని వనినిఁ, గలయుకంటెను సౌఖ్యంబు గలదె వేఱె
యెఱుగఁడే మఱి నాదురదృష్ట మింతె, కాక యాతని దూరఁగాఁ గలదె ఫలము.

24


ఉ.

తానయి చేరఁబిల్చి సురతప్రియుఁ డై యొకనాఁటికైన స
మ్మానము సేయఁగా నెఱుఁగ మానిని యేమని తెల్పుకొందు నే
నేనయి యెన్నఁడైనఁ దమి హెచ్చినచోఁ ననుఁ జేరి యెంతప్రొ
ద్దైనఁ బదంబులొత్త క్షణ మప్పటికేమొ ఘటించుఁ గోరికల్.

25


చ.

అని సురతస్పృహాహవిరుదగ్రమనోజశిఖక్షతత్రపా
వినయవివేకియై మధుపవేణివసంతవనిని హసంతికం
గనుఁగొనులీలఁ గన్ గొనుచుఁ గంజదళాక్షులఁ బాసి యొంటిమై
దనపతియున్న యింటికి ముదంబున వచ్చెఁ బదంబు దొట్రిలన్.

26


సీ.

సంపూర్ణపూర్ణిమాచంద్రబింబము చెన్నుఁ గన్న ప్రసన్నవక్త్రంబువానిఁ
వెలిమెట్టతమ్ముల వెలివెట్టఁగాఁజాలు శ్రవణాంతకాంతనేత్రములవాని
శివశరాసనశృంగశృంగశృంగారంబుఁ గబళించునంసభాగములవాని
నతికఠోరనిజస్తనాచలదక్షమం బైనవిపులవక్షంబువాని


తే.

సూర్యతేజంబు గైకొన్న శుచికిఁ జంద్ర, కాంతియు నొసంగుభంగి దుగ్ధముల నగ్ని
హోత్ర మొనరించి వేసంజ హెూమశాల, నేకతంబున నున్న ప్రాణేశుఁ గాంచి.

27


సీ.

చంకనత్ప్రత్నతాటంకంబు లిరువంకఁ గనుపట్టుచంద్రభాస్కరులు గాఁగ
నలతిపయ్యెదలోని హారము ల్చిలుపవెన్నెలలోని తారకావళులు గాఁగ
వలిపెంపుకుసుమపూవన్నెచేలమెఱుంగు జగజంపుసంజకెంజాయ గాఁగఁ
గంకణమేఘలాకటకఝళంఝళ లమితవిహంగనాదములు గాఁగఁ


తే.

గనుబొమ లనంగుఁ డూనుసింగాణి గాఁగ, విప్పుఁగన్నులు విరిగల్వవిరులు గాఁగ
బటువుగుబ్బలు ముకుళితాబ్జములు గాఁగ, సంజచెలువునఁ బతిఁ జేరి కంజవదన.

28


క.

తలవంచి మించుసిగ్గునఁ, బలుకక యూరకయె యున్నఁ బతి యచ్చెలువం
దిలకించి కలికి యేమో, తెలుపఁగ వచ్చితి వదేమి దెలుపు మటన్నన్.

29