పుట:Dashavathara-Charitramu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఈలాగందురె బాల వాంఛితఫలం బీఁజాలువిశ్వేశ్వరుం
డేలాగుండిన నుండెఁగాక మఱిమాదృక్తాపసు ల్చిత్తభూ
లీలామగ్నత నుండఁగాఁదగునె తాల్మిందూలి శాస్త్రోక్తముల్
బాలింపం దగదే గృహస్థులకు సద్భావంబుతో నెప్పుడున్.

64


తే.

దశమి హరివాసరమున ద్వాదశిని బర్వ, తిథుల సంక్రమణంబుల తిథుల నన్య
తిథులయందైనఁ బగలు సంధ్యలనుఁ ప్రేమ, నంటఁగా రాదు సతుల గృహస్థులకును.

65


క.

ఋతువై స్నానము సేసిన, సతి నంతర్గృహమునందు సంతానేచ్ఛన్
రతికృతిగాక జుగుప్సా, మతిఁ గలయుట గృహికి యుత్తమం బని పల్కన్.

66


శా.

ఔలెండా యిటువంటిఛాందసము లెన్నైనా గలా విందుకున్
వేళల్ గావని చెట్టపట్టితివి చెన్లేనవ్వుతో వల్లభుం
బాలారత్నము కేళికాకుతుకసామర్థ్యక్రియాదూరిత
వ్రీళాసూచకసానురాగవికసద్వీక్షారుచు ల్మీఱఁగన్.

67


తే.

వెఱవ దననేల కామిని విభునిచెట్ట, పట్టినప్పుడె స్వేదకంపంబు లొదవె
గద్గదిక దోఁచె మోమునఁ గాననయ్యె, దీనభావంబు నది యొక్కదిట్టతనమె.

68


తే.

నయము దెల్పెడుగతి కంకణములు మొఱయఁ, గౌను నలియింపఁ బులకలు గ్రమ్మికొన్న
గుబ్బ యరగానరాఁ బైటకొంగు జాఱ, మగువ యీగతి తెగువతో దిగువ నతఁడు.

69


చ.

వల దిది సంజవేళ చెలువా యొకయించుక తాళుమంచు నేఁ
బలుమఱుఁ జెప్పిన న్మననుఁ బట్టఁగఁజాలక నొంటిపాటున
న్వలనుగఁ గంటి కింపయిన వాని గనుంగొని ప్రేమ హెచ్చఁగా
బలిమిని జేరుజారవలెఁ బైకొనఁగోరెదు నీకు మేరయే.

70


మత్తకోకిల.

ఈమనోరథ మెల్లఁ దీర్చెద నీముహూర్తము దాళవే
కామినీ యిది వేళ గామినిఁ గైకొనంగఁ దలంపనం
చామునీంద్రుఁడు వేఁడిన న్వినదయ్యెఁ దొయ్యలి యెయ్యెడం
గామ మష్టగుణం బటం చనఁగా వినంబడునే కదా.

71


క.

ధీరాగ్రేసరుఁ డంతట, నీరేరుహనేత్రచేతినిర్బంధము దు
ర్వారముగా రుద్రనమ, స్కారము గావించి కేళికాకృతమతి యై.

72


తే.

ఎంత చెప్పిన వినవె కా నింక నీవె, యనుభవించెదు రమ్మంచు హసితవదన
యైన మాసిని కైదండఁ బూని మౌని, కేళిసదనంబుఁ జేరిన బాల యపుడు.

73


తే.

జాళువాకోళ్ళపట్టెమంచంబుమీఁదఁ, దళుకుకుంకుమపఱపుపై వలువఁ బఱిచి
జాతిపట్టుతలాడలు చక్కఁబెట్టి, కాంతుఁడు శయింపఁ దాను చెంగట వసించి.

74