80 చిన్ననాటి ముచ్చట్లు
ఏలకవుండలు, రంగుమిఠాయి, వేడిగారెలు మొదలగునవి అమ్ము అంగళ్లుండును. దూది నిమ్మకాయలను అమ్ముదురు. నులకవుండలు, పట్టెమంచములు, ముల్లుకఱ్ఱలు, ఎద్దుల మెడపట్టెలు, నవారు బిళ్ళలు, పశువుల పలుపులు, మోటతోలు మోకులు మొదలగువాటిని కూడ యిూ తిరునాళ్లలో అమ్ముచుండిరి. ఇది యొక విధముగ గృహపరిశ్రమల ప్రదర్శనము అనవచ్చును. ఇక్కడ అమ్ముచుండిన మల్లెపూలదండల వాసనను యిప్పటికిని నేను మరువలేదు. ఇది వేశ్యలుండు స్థలము గనుక చాలాదూరము నుండి పెద్ద మనుష్యులు వచ్చుచుండిరి. స్వామి రథోత్సవమునాడు బ్రాహ్మణ సంతర్పణ జరుగును. ఆ సంతర్పణకు యిప్పుడుకూడ నేను కొంత ద్రవ్య సహాయమును చేయుచున్నాను.
మా వూరిలో శివాలయము, విష్ణ్వాలయము రెండు దేవాలయము లున్నవి. శివాలయము గర్భగుడిగోపురమువైన బండబూతు చిత్రములు సొగసుగ చెక్కబడియున్నవి. ఈ చిత్రములను చూచుటకు పెద్దలు చిన్నలు కూడ చేరి చూచి సంతోషించుచుందురు. ఈ దేవాలయపు అర్చకుడు తంబళాయన. వైద్యమును చేయును. విష్ణ్వాలయపు అర్చకుడు నంబిఆయన. ఈ నంబి అర్చకుడుకూడ వైద్యుడే. ఈ వూరిలో యీ అర్చకులిరువురు వైద్యమును చేయుచుండెడివారు. సాధారణముగ పల్లెటూర్లలో నంబితంబళులే గ్రామవైద్యులు. ఈ విష్ణ్వాలయ ముఖద్వారమునకు పెద్దతలుపులను నేను చేయించి యిచ్చితిని. ఈ దేవుళ్లు పార్వేటకు (శమీపూజకు) వెళ్ళునప్పుడు స్వాములవెంట వూరి రంగిరీజులు వార్ల యిండ్లలో పురాతనముగ యుండు కత్తులు, బాకులు, ఈటెలు మొదలగు పురాతనపు యుద్ధసాధనములతో వెంట వచ్చెదరు. ఈ పాత ఆయుధములు వీరికి యెట్లు లభించినవో? విజయదశమినాడు ఆయుధములకు మెరుగుబెట్టి పూజించి నమస్కరించెదరు. ఈ వూరి