చిన్ననాటి ముచ్చట్లు 79
మావూరికి నేను పోవునప్పుడు గజ్జలగుఱ్ఱపు జట్కాబండిమీద పోవు చుందును. నా బండి వూరికి సమీపించగనే తహసీలుదారుడు వచ్చుచున్నాడని గ్రామమునసబు, కరణము, ముదాం మొదలయినవారు నడుములకు గుడ్డలనుచుట్టి దండములనుపెట్టుచు బండిని సమీపించుచుండిరి. తీరా నన్ను గుర్తించి 'ఈయన మహాదేవయ్య అల్లు' డని దిగాలపడి పోవుచుండిరి. ఇంటివద్ద బండి దిగగానే అత్తగారు ముందు నా మూటలను సవరించును. భోజనము వేళ కాగానే దొడ్డిలో యుండు ఎండకాగునీళ్లతో స్నానమును చేయమని చెంబును కుండవద్ద పెట్టును. స్నానము చేయుటకు,ప్రత్యేకముగ ఈ వూరిలో స్తలము యుండదు. కనుక గోడలు లేని దొడ్డియే స్నానముకు మరుగు స్థలము. నేను స్నానము చేయునప్పుడు యిరుగుపొరుగువారు నావద్దకు వచ్చి మద్రాసు సమాచారములను అడిగేవారు. ఆకాలమున సబ్బుతో వళ్లు రుద్దుకొనుట వింత. ప్రతివారు దగ్గరకు వచ్చి సబ్బును వాసన చూచి పోయేవారు. ఈసారి వచ్చినపుడు తమకొక సబ్బుబిళ్ళను తెచ్చి పెట్టమనేవారు. మద్రాసునుంచి నేనొక చిన్న అత్తరుపెట్టెను తీసుకపోతిని. ఆపెట్టెలో ఆరువిధములైన అత్తరు బుడ్లు అత్తరు బిళ్లలు యుండెడివి. మాకు పాలు, పెరుగు, కూరగాయలు, పచ్చి శెనగమండలు, సజ్జకంకులు వగైరాలు సప్లయి చేయు కాపువారు నావద్దకువచ్చి అత్తరువును పూయించుకొని పోవువారు. వారందరు నన్ను 'నరసయ్య' యని పిలిచేవారు.
చెదలవాడ మా వూరియేటి ఆవల వడ్డుననే యుండును. చైత్రమాసములో శ్రీరామనవమికి శ్రీరాములు ఉత్సవము చెదలవాడలో జరుగును. ఈప్రాంతములకంత ఈ ఉత్సవము ప్రసిద్దమగుటచే పొరుగూరి నుంచి వేలకొలది జనులు సంబరమును చూచుటకు వచ్చెదరు. ఇక్కడ వరిగబియ్యముపిండితోను, బెల్లముతోను తయారుచేసిన మిఠాయి,