Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 81

ప్రక్కనున్న కమ్మయేరు వూరిని క్రమముగ మ్రింగుచున్నది. దేవాలయములను కూడ కబళించుటకు గుండ్లఏరు సమీపించుచున్నది.

కోటప్పకొండయను శివక్షేత్రమొకటి గుంటూరుజిల్లా నర్సారావుపేట తాలూకాలోనున్నది. మ్రొక్కుబళ్లకు తిరుపతి కొండ వంటిదే కోటప్పకొండయున్నూ. ప్రతి శివరాత్రినాడు ఆ కొండకు వేలకొలది జనులువచ్చి శివుని దర్శించి పూజించిపోయెదరు. వారి వారి మ్రొక్కుబళ్లను కోటయ్యకు చెల్లించెదరు. ఈ క్షేత్రము ఆంధ్రదేశమున పెద్దపేరు గాంచినది. గుంటూరు జిల్లాలో మెట్టతాలూకాలందలి రైతులు వ్యవసాయమునకు ముఖ్యమైన ఎడ్లను బిడ్డలవలెనే పెంచెదరు. గృహ యజమాని జొన్నన్నమును ముద్దలు చేసి మింగునపుడు చనువు కొలది కోడెదూడ లతని వద్దకు వచ్చి, అతడు కంచమునుండి ఎత్తి నోటికందించు ముద్దలను తినిపోవుచుండును. అట్టి ఎడ్లకు, బిడ్డలకు జబ్బు చేసినపుడా రైతులు కోటయ్యకు ప్రభలు కట్టుకొని కొండకు నడిచెదమని మ్రొక్కుకొందురు. ఈ మ్రొక్కుబళ్లను చెల్లించుటకు అనేక గ్రామములనుండి రెండెద్దుల బండ్లమీద ప్రభలను గట్టి వాటిని చిత్రవిచిత్రములగు రంగుగుడ్డలతో శృంగారించెదరు. ప్రభయనగా వెదురు బొంగులతో రెండెడ్లబండ్ల గానులమధ్య అమరుటకు తగిన వెడల్పుతో సుమారు 10 అడుగుల పొడవున చట్టముగా కట్టుదురు. మధ్య మధ్య చీల్చిన అడ్డబద్దలు వేసి బిగింతురు. పై అంచున త్రికోణాకారముగా నమర్చెదరు. ఆ చట్టమునకు గుడ్డలను కట్టుదురు. దానిపై రంగుగుడ్డలను తోరణములను చిత్రములను అలంకరింతురు. చిరుగంటలు కూడ కట్టుదురు. ప్రభలకేగాక వానిని లాగుటకై ఏర్పరచిన ఎద్దులకుకూడ ఆప్యాయముగ గంటలను, గజ్జలను, మువ్వలను అద్దాలశిగమోరలను కట్టి అలంకరింతురు. ఈబండ్లకుకట్టే ఎద్దులను ప్రత్యేకశ్రద్ధతో అన్నిటికన్నా హెచ్చుగా పోషింతురు. వీటికి పచ్చి జొన్న చొప్ప, ఉలవలు, పత్తివిత్తులు