66 చిన్ననాటి ముచ్చట్లు
ముఖ్యముగా తానులు చలవచేయువారు విస్తారమగుటచే దీనికి చాకలిపేట అని పేరు వచ్చెను. అయితే ఆ వరక్తము ననుసరించి ఇతర జాతులవారున్నూ ఇచ్చట చేరిరి. క్రమముగా నిది పట్నమందలి సంపన్నగృహస్థుల నిలయమైపోయినది. నాడు దీనిని అందచందములుగల ప్రదేశము (Fashionable Quarters) అనే వారు. ఇచ్చటనే శ్రీపిట్టి త్యాగరాయశెట్టిగారు నివసించుచుండిరి. వారు నేతవృత్తిగల దేవాంగ కులములో పెద్దలు; పిదప బ్రాహ్మణేతరోద్యమమునకు నాయకులు. మద్రాసు కార్పోరేషన్ కు మొట్టమొదటిసారిగా అధ్యక్షులుగా ఎన్నుకోబడినవారు. వారిని 'మద్రాసునకు మకుటము లేని రాజు' (The Uncrowned King of Madras) అనేవారు. గవర్నరులను కూడా లక్ష్యపెట్టేవారుకారు. కొల్లా వెంకటకన్నయ్య శ్రేష్ఠిగారు కూడా ఇక్కడనే నివసించేవారు. వీరు వైశ్యకులమునకు పెద్ద శెట్లు. వావిళ్ల రామస్వామిశాస్త్రులుగారున్నూ సుమారు ఇచ్చటనే తమ ఆదిసరస్వతీ ముద్రాక్షరశాలను, గ్రంథనిలయమును నెలకొల్పి నడిపిరి; దానిని వారి కుమారులు శ్రీ వేంకటేశ్వర్లుగారు విడువక వృద్ధిచేశారు. లాయరు కృష్ణ స్వామి శెట్టిగారున్నూ ఇచ్చట కాపురముండినవారే. ముట్నూరి ఆదినారాయణయ్యగారును ఈప్రాంతముననుండినవారే. వారు రెవిన్యూ శాఖలో గొప్ప గొప్ప ఉద్యోగములను నిర్వహించిరి. చల్లపల్లి జమీందారుల బంధువులును ఈప్రాంతములోనే గొప్ప బంగళాలలో నివసించు చుండేవారు. పురాతనకాలమున తంజావూరు రామానాయుడుగారును వారి కుమారులు రంగయ్యనాయుడుగారును ఇచ్చటనే యుండిరి. కొల్లావారున్నూ రామానాయుడుగారున్ను ఇచ్చట తమ తమ పేరట అగ్రహారములు నెలకొల్పిరి. కొల్లావారి అగ్రహారమునందే ముట్నూరి ఆదినారాయణయ్య గారు నివసించుచుండినది. ఇచ్చటనే ఆంధ్రవైష్ణవ పండితోత్తములునుండిరి. ఆ రోజులలో ఇచ్చట విద్వద్గోష్టులు హెచ్పుగ జరుగుచుండెడివి.