Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 67

ఆంధ్రేతరులలో గొప్పవారును ఇచ్చట నివసించుచుండిరి. సర్ ఉస్మాన్గారు గొప్ప యునానీవైద్య కుటుంబమునకు చెందినవారు. వారి కుటుంబమును ఇచ్చటనే నివసించుచుండెను. సర్ సి.పి. రామస్వామి అయ్యర్ తండ్రి పట్టాభిరామయ్యర్గారును, సుప్రసిద్దులు సి.వి. రంగనాధశాస్త్రి వారి కుమారులు కుమారస్వామిశాస్త్రిగార్లును ఇచ్చటనే నివసించుచుండిరి. దాక్షిణాత్య వైష్ణవులు మద్రాసునకు పెద్ద ఉద్యోగస్తులుగాను, వకీళ్లుగాను వచ్చి మైలాపూరున నివాసమేర్పరచుకొనిన పిదప, ట్రాము, బస్సు సౌకర్యము లిటు హెచ్చిన పిదప చెన్ననగర సౌభాగ్యలక్ష్మి. ఉత్తరమునుండి దక్షిణమునకు మ్రొగ్గినది.

మద్రాసులో గొప్ప కట్టడములై రాణించుచున్నవి చాలవరకు, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత నేచూచుచుండగా, కట్టబడినవే.

నేను కొన్ని దినములు పచ్చయప్ప కాలేజికి సంబంధించిన గోవిందప్పనాయకరు హైస్కూలునందు చదువుచుంటిని. అక్కడ చదువుచుండిన కాలముననే ఇప్పటి క్రొత్త హైకోర్టు భవనమును కట్టుచుండిరి. తాటికొండ నంబెరుమాళ్ల శెట్టిగారు కంట్రాక్టుకు తీసుకొని కట్టుచుండిరి. ఆ కట్టడమునకు విశేషముగ మలిచిన నల్లరాళ్లను ఉపయోగించుచుండిరి. ఆ రాళ్లను సులభముగ పైకి తీసుకొని పోవుటకు కొన్ని యంత్రములను (Lifts) వాడుచుండిరి. ఆ యంత్రములను చూచుటకు స్కూలు నుండి కొందరు పిల్లకాయలు అక్కడికి పోవుచుండిరి. నేనును బడికి పోవుటకు ఇష్టము లేనినాడు, పాఠములను చదువనినాడు కానీ బటానీలను కొని జేబులో పోసుకొని కట్టుచుండు కట్టడము వద్దకుపోయి కాలమును గడుపుచుంటిని. గనుక ఈ కొత్త హైకోర్టు నా తనిఖీ మీదనే (Supervision) కట్టబడినదని చెప్పవచ్చును. పాత హైకోర్టు యిప్పటి కలెక్టరు ఆఫీసు నందుండెను.