Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 65

వైకుంఠవాత్యాయర్ వీధి జార్జిటౌనులో యున్నది. ఇందు ముందు నివసించుచుండిన వారందరు వైష్ణవులు. వీరలలో ముఖ్యముగ వంటచేయు వారు, అయ్యంగార్లు అమ్మంగార్లు నుండిరి. వెండ్లి పేరంటములను చేయించు వైష్ణవ పురోహితులునుండిరి. ఈవూరిలో కర్మాంతరములలో బ్రాహ్మణులకు శయ్యాదానమును చేయు ఆచారము కలదు. ఈ శయ్యా దానమునకై సాధారణముగ చనిపోయినవాడు పండుకొనుచుండిన మంచమునే ఇచ్చుట వాడుక. ఈ శయ్యాదానము పట్టు పౌరోహితుడును వాని భార్యయ శయ్యపై, అనగా నామంచముపై కూర్చుండి, పాదపూజను చేయించుకొని దానమును తీసుకోవలయును. ఏ ఊరినుండో పొట్ట ఆత్రమునకై వచ్చిన పేదపౌరోహితుడు భార్యనుకూడా చంకబెట్టుకొని వచ్చినాడా? భార్య హాజరులో లేనివాడేమి చేయును? అట్టివారికి దానసమయమున సహధర్మచారిణి యగుటకు బాడుగ తీసుకొనివచ్చు భార్యలు ఈ వీధిలో సులభముగా దొరుకుచుండిరి. ఆమె యేజాతియో తెలియకున్నను, అవసరము కొలది స్మార్తవేషమునుగాని వైష్ణవ వేషముగాని ధరించి ఎబ్బెరికము లేకుండా పౌరోహితుని ప్రక్కన కూర్చుండి, ఏనాటి సుకృతము వల్లనో, క్రతువులుచేయు యజమానిచే పాదపూజ చేయించుకొని శయ్యాదానమును ఆ తత్కాల భర్తతోపాటు స్వీకరించెడిది. ఈ ఊరిలో మరియొక చిత్రము గలదు. మరణించినవారికి బంధు బలగము లేనప్పడు కూలిదీసికొని ఏడ్చిపోవువారున్నూ ఉండిరి.

పాతచాకలపేట చాలా ముఖ్యమైన స్థలము. ఇది తిరువత్తియూరు హైరోడ్డును ఆనుకొనియున్నది. ప్రథమములో ఇక్కడ ఈస్టిండియా కంపెనీవారు ఈ చుట్టుప్రక్కల వస్త్రములను నేయించి, చలవ చేయించి, రంగు లద్దించి విదేశములకు ఎగుమతి చేయువారుగదా. ఆయా వృత్తుల వారంతయు ఇక్కడ తరతరములుగా కాపురముంటున్నారు. అందు