చిన్ననాటి ముచ్చట్లు 53
ధరించుచుండిరి. ఆ తలపాగా గుడ్డ జానెడు వెడల్పును కల్గి సుమారు 30 లేక 40 మూరల పొడవు ఉండెడిది. ఈ పాగాలు వివిధ రంగులలో యుండును. ఈ తలపాగా గుడ్డను ఆ కాలమునందు ప్రత్యేకముగ అంగళ్ల యందు అమ్ముచుండిరి. ఈ తలపాగాను చుట్టు మనిషి యింటింటికి వచ్చి తలకు వంకర పాగాను చుట్టి పోవుచుండెను. ఈ వంకరపాగా చుట్టినందుకు వీనికి ఒక అణా మొదలు రెండు అణాల వరకు కూలి ఇవ్వవలెను.
కొన్ని సంవత్సరములకు మునుపు జార్జిటవున్ గోవిందప్పనాయుని వీధిలో పట్టపగలు యిండ్లలో దొంగలు జోరబడుటకు ప్రారంభించిరి. గోవిందప్పనాయుని వీధిలో యున్న ఇండ్లు ఒకదానికొకటి ఆనుకొని వుండుటవలన ఒక ఇంటి మిద్దెమీద నుండి ఆ వీధిన నుండు మిద్దెలన్నిటిమీద సులభముగ నడవవచ్చును. ఇందువలన ఒక చోటుపడ్డ దొంగలు పక్కయిండ్లకు పోవుచు ఇండ్లలో వంటరిగనున్న స్త్రీలమెళ్లలో యుండిన నగలను కత్తిరించుకొని పోవుచుండిరి. అప్పటినుండి గోవిందప్ప నాయుని వీధిలోనేగాక యితర యిండ్లలో యుండు ముంగిళ్లకును ఇనుపపట్టాల పందిళ్లను వేయవలసి వచ్చెను. అప్పటినుండి మద్రాసులో కట్టు ప్రతి యింటి ముంగిలికి ఇనుపపట్టాల బందోబస్తున్నది. ఇప్పడు మద్రాసులో కిటికీ కమ్ములను వూడలాగి దొంగలు యింట ప్రవేశించు చున్నారు. వాననీళ్ల గొట్టముల నెక్కి యింట ప్రవేశించి దొంగతనములను చేయుచున్నారు. తలుపు తాళం వేసిన ఇండ్లలో దూరి దోచుకొని పోవుటకూడ విస్తారముగ నున్నది. ఈ దోపిళ్లు రాత్రిళ్లే గాక పగలున్నూ జరుగుచున్నవి. ముఖ్యముగా 11-5 గం||లకు మధ్య జరుగునట. ఇట్టివి జరుగకుండా నౌకర్లను కాపలాయుంచుడనియు, కానిచో ప్రక్క ఇంటివారితో చెప్పి వెళ్ళుడనియు పోలీసు అధికారులు ఉపాయము చెప్పుచున్నారు.