Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38 చిన్ననాటి ముచ్చట్లు

పులుసును అన్నిటికిని వాడుకొనుచుండినది. అంగడి వుప్పును ఆ దినమునకు కావలసినంత తీసుకొని రాతి చిప్పలో వేసి నీళ్లలో కరగనిచ్చి భోజనపదార్ధములలో ఆ వుప్పునీటిని వేయుచుండినది. ఇందువలన ఆ వుప్పులోయున్న రాళ్లు, మన్ను మనకడుపులోకి పోకయుండును. నేతిని వీరు వాడరు గనుక నూనెను మాత్రము తెప్పించి జాడీలోపోసి వాడుకొనుచుండిరి. నూనెలో బెల్లమును వేసినందున నూనె తేటబడును. మజ్జిగకు బదులు సాతీర్ధమును (పుల్లనీళ్లు) వాడుకొనుచుండిరి. మోదుగ ఆకులను తెచ్చుకొని తీరిక కాలములో భార్యా భర్తల్లు కూర్చుని ఎకచకములాడుకొనుచు జానెడు విస్తళ్ళను కుట్టుకొని వాడుకొనుచుండిరి.

వారి వంటకు చిన్న మట్టిపొయ్యిని సొగసుగ ఆమెయే వేసుకొనును. పొయ్యి మంట వృథాగాపోకుండ, పొయ్యివద్ద కూర్చుండి నేర్పుగ మంటవేయుచు కొద్దిపుల్లలతోనే వంటంతయు చేయుచుండినది. అన్నమును వండు కంచుతప్పెల అడుగున మట్టిపూసి పొయ్యిమీద పెట్టను. ఇందువలన తప్పెలను అరగ తోము పనియుండదు. భోజనానంతరమున అంట్ల తప్పెలను ముంగిటిలో వేయును. పాడు కాకివచ్చి తప్పెలను అటు యిటు దొర్లించి గణగణ శబ్దమును చేయునే గాని ఆ కాకిముక్కుకు ఒక మెతుకుముక్కయైనను దొరకదు. స్నానమునకు బావినీళ్లు, పానమునకు వేడినీళ్లను వాడుకొనుచుండిరి. ఒక పూట మాత్రమే వీరు వంట చేసుకొనుచుండిరి. సాయంత్రము వంట ప్రయత్నము లేదు గనుక అయ్యరు బడినుండి వచ్చిన వెంటనే యిరువురు స్నానమునుచేసి అలంకరించుకొని ఇంటి సమీపముననుండు చెన్నకేశవ పెరుమాళ్ల సన్నిధికి సరిగా ప్రసాద సమయమునకు బిడ్డలతో కూడ పోవుచుండిరి. ఈ విష్ణుసన్నిధిలో దినము పుళిహోరను, దధ్యోజనమును భక్తులకు పంచిపెట్టుచుండిరి. ఆప్రక్కననే శివాలయము కూడ యుండినను