చిన్ననాటి ముచ్చట్లు 39
అక్కడికి భక్తులెవరు పోరు. ఏలననగా శివాలయములో ప్రసాదముగ విభూతి నిచ్చెదరు గనుక.
ఈ మంగళాంబకు ఒడిబిడ్డ, ఎడబిడ్డ యిద్దరు బిడ్డలుండిరి. ఒడిబిడ్డకు డబ్బాపాలకు బదులు, రాగులను నానవేసి, బండమీద నూరి, ఆ రాగులను గుడ్డలో వడియగట్టి కాచి అందులో కొద్దిగ బెల్లమును కలిపి, ఆకలెత్తినపుడెల్లను మితముగ యిచ్చుచుండినది. ఈ రాగులపాల వలన ఆ చంటిబిడ్డ రబ్బరుబొమ్మవలె బసబుసలాడుచు పెరుగుచుండెను. ఈ రహస్యము అరవ తల్లులకు తెలియును. ఎడబిడ్డ ఏడ్చినపుడు వరిపేలాలు బెల్లము కలిపి చేసిన బొరుగు వుండలను యిచ్చుచుండినది. ఈ ఆహారము వలన పిల్లవాని ఆరోగ్యము కూడ బాగుంటూ వచ్చినది. ఆదివారము నాడు అయ్యరుకు తెల్లగెనుసు గడ్డలను కుమ్మలో పెట్టి ఫలహారము పెట్టుచుండినది. ఈ తెల్లగెనుసు గడ్డలనే నెహ్రూగారు కఱవుకాలమున అందరికి ఆరోగ్యకరమైన ఆహారమని పలుమారు చెప్పచున్నారు. ఈ రహస్యమును అరవతల్లి ఆకాలముననే గ్రహించినది.
తెల్లవారగనే కాఫీ, ఫలహారములు అలవాటు లేదు. అయ్యరు స్నానముచేసి, జట్టును జారుముడివేసి విభూతిని వళ్లంతయు పూసుకొని వెంటనే వంటయంటిలోకి పోయి, రాతిమరిగలో పులియుచున్న పుల్లనీళ్ల అన్నమును నీళ్లను కడుపార త్రాగి జఱ్ఱున త్రేపుచు బైటకు వచ్చి, ఉడుపులను తగిలించుకొని పాఠశాలకు పోవును. మరల అయ్యరు ఒక గంటకు వచ్చి వేడి అన్నమును తినును.
ఈ అయ్యర్ అయ్యవారకి నెలకు జీతము రూ. 20 లు గనుక జీతమును తీసుకొన్న నాడే దోవలోనున్న పోస్టాఫీసుకుపోయి సేవింగ్సు బ్యాంకిలో రూ.5 లు కట్టి వచ్చును. మిగత రూ. 15 లు యిల్లాలివద్ద