చిన్ననాటి ముచ్చట్లు 33
కాళ్లకు గొలుసులు, కట్టుచీరెలతో పెండ్లి కి ప్రయాణమై వూరికిపోతిని. పట్నం నుంచి పల్లెటూరికి పెండ్లి సన్నాహముతో పోగానే వూరివారందరు పట్నం చీరెలను, నగలను చూచుటకు పరుగెత్తి వచ్చిరి. ప్రదర్శనము జరిగెను.
నా పెండ్లి మావూరికి సమీపమున చెదలవాడయను గ్రామమున యుండు శ్రీరాముల దేవాలయములో జరిగెను. మా వూరికిని చెదలవాడకును నడుమ గుండ్లకమ్మ యేరు అడ్డము. నిండు యిసుకలో చెదలవాడకు నడచిపోవలయును. ముహూర్తము నాడు తెల్లవారగనే మాకు మంగళస్నానములయినవి. పాతపల్లకి వచ్చినది. చాకలివారు పల్లకిని మోయుటకు హంసపాదికలతో సిద్దమైరి. మంగలివారే భజంత్రీలు కూడాను. పల్లకిలో కూర్చుంటిమి. పల్లకి సాగినది, ఏరు దాటినది. ఇసుకలోకి పోగానే చాకలివారి కాళ్ళు కాలి ముందుకు పరుగిడవలసి వచ్చెను. మేళగాండ్లు వెనుక చిక్కిరి. కూడ వచ్చు పెండ్లివారి సంగతి నిక చెప్పనేలా! తిన్నగ 12 గంటలకు దేవాలయము ప్రవేశించితిమి. ఒక మూల వంట ప్రయత్నము, మరియొకచోటు పెండ్లి ప్రయత్నములు జరిగెను.
చెదలవాడ గ్రామము భోగము పడుచులకు ప్రసిద్ధికెక్కినది. ఈ గ్రామమున యుండు భోగమువారందరు దేవాలయ మాన్యములను అనుభవించుచు దేవుని కొలుచువారే. వీరిలో ముఖ్యముగ యెఱ్ఱబాయి, నల్లబాయి యను పేరుగల యిద్దరు వేశ్యలుండిరి. వీరికీ పేరు శరీరపు రంగును బట్టియే వచ్చినవి. ఈ యెఱ్ఱబాయమ్మ మామగారికి స్నేహితురాలగుటచే పెండ్లి సరఫరా చక్కగ జరిగినది. సాయంత్రము చదురు కూడ జరిగినది. పెండ్లి ముగించుకొని పల్లకినెక్కి చీకటికి ముందటనే యిల్లు చేరితిమి.
ఆ రాత్రియే వూరిలో వూరేగింపు కూడ. మా వూరేగింపు చూచుటకు వూరి వారందరు కూడిరి. ఆ కాలమున నూనె దివిటీలకు