6
పెండ్లి
నేను మద్రాసులో జీవనోపాయమును సంపాదించుకొన్నందున నా మేనమామగారు నాకు పిల్లనిచ్చి పెండ్లి చేసెదనని జాబును వ్రాసిరి. మంచిదని జవాబిచ్చితిని. పెండ్లి సన్నాహమునకు కావలసిన సామానులను సమకూర్చుకొనవలసి వచ్చెను. నాచేత డబ్బు లేనందున చిన్ననాటి స్నేహితుడగు అన్నం చెన్నకేశవులు శెట్టిగారిని మరల ఆశ్రయించితిని. శెట్టిగారు యింటిలో స్వతంత్రులు గారు. చిన్నవారు తల్లిదండ్రుల చాటున నున్నవారు. గనుక వారివద్ద ఆ సమయమున రొఖ్కం లేదు. ఆ కాలమున మద్రాసులో ధనికులు, పురుషులు కూడ చేతులకు బంగారుకాపులను (మురుగులు) గొలుసులను ధరించుకొనుచుండిరి. మా శెట్టిగారు కూడ లావాటి మురుగులను గొలుసులను తొడుగుకొని యుండిరి. ఆ మురుగులు గొలుసులు వారి చేతికి వదులుగ నుండెను. అప్పుడు శెట్టిగారు కంసలిబత్తుని వద్దకుపోయి తన చేతుల మురుగులలోని బంగారమును కొంత కోసి నాకు యిచ్చి పెండ్లి నగలు చేయించుకొమ్మని చెప్పిరి. ఆ బంగారముతో ఆ కాలపు నాజూకు నగ, నెల్లూరి గజ్జలపట్టెడను చేయించితిని. కాళ్లకు యేనుగు గొలుసులు, పావడాలు, పట్టెగొలుసులు మేలైన జర్మను సిల్వరుతో తయారు చేయించితిని. ఆ కాలమున పేరుపొందిన బాలామణియను ఒక దేవదాసి యుండెను. నాటకములలో ప్రసిద్ధి చెందిన నటకురాలు. తారాశశాంకము, డంబాచారి విలాసము యను నాటకములలో బాలామణిని చూచుటకు మద్రాసులో వేలకొలది ప్రేక్షకులు పోవుచుండిరి. బాలామణి అక్క కోకిలాంబ పురుషవేషమును ధరించెడిది. అప్పడు ఆ బాలామణి పేరుతో చీరలను నేసి, బాలామణి చీరెలని అమ్మెడువారు. ఆ చీరెలను రెంటిని నా పెండ్లికి కొంటిని. మెడకు పట్టెడ,