34 చిన్ననాటి ముచ్చట్లు
బదులు కుడప పీడకలను కిరసనాయిలులో తడిపి దివిటీలు వెలిగించుచుండిరి. చాకండ్లు దివిటీలను పట్టుకొనిరి. పల్లకి లేచినది. ఊరేగింపు నడివీధికి పోయినది. ఈ దివిటీల కిరసనాయిల పొగ వాసనకు పెండ్లికూతురు తట్టుకోలేక కడుపులో త్రిప్పి వమనమును చేసుకొనినది. ఆ వమనము యెదుటనున్న నావళ్ళోనే జరిగెను. ఇదియే నాకును ఆమెకును జరిగిన ప్రథమ పరిచయము.
వివాహానంతరము నేను మనుగుడుపులకు అత్తవారి యింట్లో వారమురోజులుంటిని. ఈ దినములలో గ్రామమునసబు, కరణం మొదలగువారు వారి తాతముత్తాతల నాటి పాత కోర్టు రికార్డులను తీసుకువచ్చి నన్ను చదివి అర్ధము చెప్పమనేవారు. పూర్వాచారపరాయణులు కొందరొచ్చి 'అబ్బాయి! పట్నంలో జాతివాడు మరద్రిప్పిన గొట్టములోని నీరు త్రాగుచున్నారటనే నిజమేనా? మద్రాసులోని కూరలు తినిన ఏనుగ కాళ్లగుట నిజమేనా?' అని అడిగేవారు. నన్ను చూడవచ్చిన ప్రతి వకరును తమకు, తమకు కావలసిన వస్తువులను తలా వకటి, ఈసారి వచ్చినప్పుడు తెచ్చిపెట్టమని నన్ను అడిగేవారు. నీళ్లు నిల్వచేసుకొనుటకు పెద్ద కొయ్య పీపాయిని తెచ్చిపెట్టమని ఒకరు చాలాదూరం ప్రార్ధించిరి.
మాయింటి ప్రక్కన, ఒకనాడు వారి దొడ్లోనుంచి వెఱ్ఱికేక వినబడినది. ఆ కేకను విని అక్కడికి వెళ్లి చూచితిని. నులకమంచము మీద ఆడుబిడ్డను కూర్చుండబెట్టి మసిలే నీళ్లను ముంతతో ఆ పిల్లనెత్తిన పోయుచుండెను. మరియొక ముంత మంచముమీద పోయుచుండెను. ఆ బిడ్డ కన్నతల్లిని అడిగితిని. పిల్ల తలనిండుగ పేలున్నవనిన్నీ, మంచము నిండుగ నల్లులున్నవనిన్నీ వాటిని చంపుటకు యిట్లు చేయుచున్నాననిన్నీ చెప్పెను. ఆ ప్రకారము ఆ తల్లి యెంతకాలమునుంచి చేయుచున్నదో గాని కొంత కాలమునకు ఆపిల్లకు మతిచెడివెఱ్ఱిచూపుల పిల్ల అయినది. పేలకు, నల్లులకు సిద్ధౌషధమును కనిపెట్టిన భాగ్యశాలి! ఈ వూరిలోనే నేను కూడ పుట్టినది.