30 చిన్ననాటి ముచ్చట్లు
కుటీరమునకు నా పేరు జోడించి వైద్యశాలకు ′కేసరికుటీరం′ అను నామధేయముతో వైద్యసంస్థను స్థాపించితిని. ఇంటిముందు వసారాగోడవైన 'కేసరి కుటీరం - ఆయుర్వేద ఔషధశాల' యని బొగ్గుతో పేరు వ్రాసివుంచితిని. ఆ కాలమున నారాయణ మొదలి వీధిలో చాలామంది వైశ్యులు కాపురముండుచుండిరి.
నేనుండిని యిల్లు వీధిమధ్య నుండుటవలన వచ్చువారికి, పోవువారికి తెల్లగోడ మీద వ్రాసిన బొగ్గు అక్షరములు పిలిచినట్లు కనబడుచుండుట వలన అందరు చదువుకొనుచు పోవుచుండిరి. ఈ ప్రకారము ఈ పేరు కొంతకాలమునకు అందరి నోటబడి క్రమముగ చిన్న వైద్యశాలగ మారినది. నేను కొంతకాలము ఆ వీధిలోనేయుండిన కన్యకాపరమేశ్వరి వైద్యశాలలో కొలువు చేసియుండుట వలనను, చాలామంది వైశ్యులు నాకు తెలిసినవారగుట వలనను వారందరు నా వద్దకు మందులకు వచ్చుచుండిరి. సాధారణముగ వైశ్యులలో చిన్నతనముననే వివాహమాడు ఆచారముండుట వలన చాలా మంది విద్యార్దులుగ నుండినప్పుడే వివాహమాడి గృహస్తులుగ నుండుట సంభవించుచుండెను. వీరిలో కొందరు వయసు వచ్చీరాని వారుండిరి. వీరలలో విద్య అలవడుటకు, పుష్టిగా నుండుటకు మందులు కావలసిన పలువురు నన్నాశ్రయించుచుండిరి. నేను తియ్యటి లేహ్యములను, కమ్మటి షరబత్తులను చేసి యిచ్చుచుంటిని. ఇందువలన నా వైద్యవృత్తికి చాలా లాభముగా నుండెను.
ఇల్లు చాలా చిన్నదగుట వలనను, పలువురు వచ్చిన కూర్చుండుటకు తగిన వసతి లేనందునను మరియొక యిల్లును ఆదియప్ప నాయుని వీధిలో పెద్దయిల్లుగా చూచి వైద్యశాలను అక్కడికి మార్చితిని. ఈ యింటకి వచ్చిన పిమ్మట మందులను బయట వూర్లకు కూడ పంపుటకు ప్రయత్నించి కొన్ని కరపత్రములను అచ్చువేయించితిని. ఒక గుమాస్తాను, ఒక బోయవానిని