పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 29

సుందరాంగి వెంటనే యింటికి వెళ్లి మద్రాసు కేసరి కుటీరమునకు ′తాంబూల రంజినీ' మాత్రలను పంపమని ఆర్డరు పంపెను. మూడవ దినమున మాత్రల పార్సిలు వచ్చెను. వచ్చిన ఆ రాత్రియే మాత్రలను భర్తకిచ్చెను. మరుసటి దినము మొదలు భర్తలో మార్చుగలిగి క్రమముగ అనుకూల దాంపత్య సుఖమనుభవించుచు త్వరలోనే సుందరాంగి సుముఖుని గనెను.

ఇదియే నా ప్రకటన.

ఆ కాలమున వార్తాపత్రికలలో ఔషధముల ప్రకటనలు చాలా తక్కువగా నుండెను. ఈ ప్రకటనను చదివినవారందరు మాత్రలకు ఆర్డర్లు పంపుచుండిరి. ఈ పడకటింటి మందును రుచి చూడవలయుననే కోరికతో పురుషులుకూడ తెప్పించుకొనుచుండిరి. తమాషాకు కూడా కొందరు తెప్పించుకొని వాడుకొనుచుండిరి. కొందరు పురుషులు తమ పెంకె భార్యలకు కూడా యిచ్చుచుండిరి. ఈ విధముగ ఈ మాత్రలకు గిరాకి యేర్పడి క్రమముగ సప్లయి చేయుటకు సాధ్యముకాక యుండెను. దినమునకు సుమారు నూరు రూపాయల మాత్రలను విక్రయించుచుంటిని. ఈ చిన్న సన్నివేశమే నా జీవయాత్రను దారిద్ర్యారణ్యమునుండి ధనార్జనా సమర్దుని చేయు రాజమార్గమునకు చేర్చినది. నాటి నుండియే నా జీవితమార్గము సుఖసౌకర్యములకు మలుపు తిరిగినది. ఈ విధముగ నాకు ప్రోత్సాహము కలిగించిన ఈ స్త్రీధనముతో వైద్యశాలను వృద్ధిపరచి ఇతర మందులను తయారుచేయగలిగితిని.

1900 సంవత్సరమున మద్రాసు జార్జిటవున్ నారాయణ మొదలి వీధిలో యొక చిన్న బాడుగ ఇంటియందు కేసరి కుటీరమును మొట్టమొదట స్థాపించితిని. ఆ యిల్లు చిన్నదగుటవలన ఇంటికి కుటీరమని పేరుపెట్టి ఆ