చిన్ననాటి ముచ్చట్లు 31
సహాయముగ కుదుర్చుకొంటిని. అచ్చువేసిన కరపత్రములను స్వయముగా సాయం సమయమున మద్రాసులో అక్కడక్కడ యున్న ఆఫీసులవద్ద నిలుచుకొని ఉద్యోగస్తులకు పంచిపెట్టుచుంటిని. వీలు చూచుకొని ఆఫీసులలోకి పోయి కొందరి ఆఫీసర్లకు మందులమ్ముచుంటిని. చిన్న క్యాటలాగులను అచ్చు వేయించి వాటినిగూడ తీసుకొని రైలు ప్రయాణములను చేయుచు పెద్దవూర్లలో దిగి, రెండు మూడు దినములు అక్కడవుండి, షాపులవార్ల వద్దకు వెళ్లి, మందుల ఆర్డర్లు తీసుకొనుచుంటిని. నేను కేసరి కుటీరం యేజంటునని వార్లకు చెప్పచుంటిని. వారలకు నాపేరు కె. నరసింహం అని చెప్పి నా విజిటింగు కార్డును యిచ్చుచుంటిని. ఆ కాలమున ఈలాంటి వైద్యశాలలు తక్కువగుటవలన ఆర్డర్లు మెండుగా చిక్కుచుండినవి.
ఈ ప్రకారము వైద్యశాలను స్థాపించిన ప్రారంభదశలో అన్ని కార్యములను నేను స్వంతముగనే చూచుకొనుచు వైద్యశాలను దినదినాభివృద్ధి చేయుచుండుటవలన వైద్యశాలకు స్థలము అధికముగ కావలసి వచ్చి ఒక చోటునుండి మరియొక చోటికి అప్పుడప్పుడు మారవలసి వచ్చుచుండెను. ఆదియప్పనాయుని వీధినుండి మలయపెరుమాళ్ల వీధికి, పిమ్మట గోవిందప్ప నాయుని వీధికి, అటు పిమ్మట బందరు వీధికి మారితిని. ఈ ప్రకారము బాడుగయిండ్ల బాధను అనుభవించుచు స్వంతగృహమునకు ప్రయత్నించి, ఎగ్మూరులో యొకయింటిని వేలములో కొని ఆ పాతయింటిని పడగొట్టి క్రొత్తగ అన్ని వసతులకు సరిపోవునటుల ఒక గృహము నా కాపురముండుటకు, రెండవదానిలో ఆఫీసు అచ్చుకూటముల నుంచుటకు, రెండు భవనములను కట్టించితిని.