26 చిన్ననాటి ముచ్చట్లు
తరిమివేయుటయో, సామాన్యముగ జరుగుచుండినవి. మగని బాధలను భార్య భరించజాలక, నూతిలో పడుటయు, విషము త్రాగుటయు, కిరసన్ నూనెతో కాలిపోవుటయు మొదలగు అమానుష కృత్యములు పలుమార్లు జరుగుచుండుట వినుచుంటిని. ఈ కారణములవల్ల ఆకాలపు గృహలక్ష్మికి మనశ్శాంతిలేక కాలమును కడుకష్టముతో గడుపుచుండెను. ఈ సందర్భమును నేనప్పుడు అవకాశముగ తీసుకొని స్త్రీలను బాగుపరచి తద్వారా నేనును బాగుపడవలయుననే సదుద్దేశముతో ఒక చిన్న పన్నాగమును పన్నితిని.
నేనొక అడ్వర్టైజమెంటును (ప్రకటనను) తయారుచేసుకొని ఆ కాలమున సుప్రసిద్ధ తెలుగు పత్రికయగు 'ఆంధ్ర ప్రకాశిక' కార్యాలయమునకు వెళ్లితిని. ఈ కార్యాలయము అప్పడు మౌంటురోడ్డులో యొక మిద్దెమీద యుండెను. ఈ పత్రికాధిపతియగు ఎ.సి.పార్థసారధినాయుడు గారిని చూచితిని. నేను వారిని దర్శించుటకు వెళ్ళినప్పుడు వారు పాత వార్తాపత్రికలను చించి వాటి కాళీస్థలమున పెన్సలుతో వ్యాసములు వ్రాయుచుండిరి. నేను వారిని చూచి నమస్కరించితిని. చిఱునవ్వుతో నన్ను చూచి కూర్చుండుమనిరి. వచ్చిన కారణమును వివరించిరి. నా జేబులోనున్న అడ్వర్టయిజుమెంటును వారి చేతికిచ్చి పత్రికలో ప్రచురించమని అడిగితిని. నేనిచ్చిన కాగితమును రెండు మూడుసార్లు ఇటూ అటూ, పారచూచి నన్నుచూచి ఫక్కున నవ్వి ఇది వేయుటకు తడవకు రూ. 10 లు ఛార్జి అగునని చెప్పిరి. అంత యిప్పుడు ఇచ్చుకోలేనని చెప్పి నావద్దయున్న అయిదు రూపాయిల నోటును తీసి వారి చేతిలో పెట్టితిని. అప్పడు వారు నన్ను చూచి నీవు చాలా గడుసువాడవుగ నున్నావని చెప్పి మరియొకసారి నవ్వి నన్ను పంపివేసిరి.