పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 25

నుండుటవలన సులభముగ నామీద క్రిమినల్, సివిల్ కేసులను తెచ్చి నన్ను చాలా కష్టనష్టములకు పాలుచేసిరి. తెచ్చిన కేసులు వారికి లాభించలేదు. కడపట Trade Mark Suit వారికి నాకు హైకోర్టులో జరిగెను. ఈ కేసులో జడ్డిగారి సలహా మీద వారు నేను సమాధాన పడితిమి; వారికి నేను కొంత డబ్బు యిచ్చి, నా మందులకు, వ్యాపారమునకు వారికి యేలాటి సంబంధము లేకుండా హైకోర్టు డిక్రీని పొందితిని. ఈ కష్టములన్నిటికి కారణం యిరువురికి విభాగ పత్రము లేకుండటయే.

నా వ్యాపారము దినదినాభివృద్దినందుచు పచ్చయప్ప కళాశాలకు ప్రక్కనయుండిన బందరువీధిలో నున్నప్పడు, సికింద్రాబాదులో కేసరి కుటీరం బ్రాంచిని స్థాపించితిని. ఈ బ్రాంచికి నెల్లూరు కాపురస్తుడగు వరదయ్య నాయుడు గారిని యేజెంటుగ నేర్పాటు చేసితిని.

వీరు సికింద్రాబాదులో పనిచేయుచు, తన కుమారునికి కేసరి యని పేరుపెట్టి అక్కడ విక్రయించుచున్న మందులు తనవేయని బూటకపు మందులను చేసి విక్రియించుచుండిరి. ఈ విషయమును తెలుసుకొని నేను అక్కడికివెళ్లి వారిని అక్కడనుంచి తొలగించితిని, వరదయ్యనాయుడు గారు సికింద్రాబాదునుండి నెల్లూరికి వచ్చి స్వంతషాపు పెట్టి కేసరి లోధ్ర, అమృత, అర్క యను పేర్లతో మందులమ్ముచుండిరి. అప్పడు నేను వారిమీద నెల్లూరిలో కేసు చేయవలసివచ్చెను. వరదయ్యగారు కోర్టులో, నన్ను క్షమాపణ కోరుకున్నందున కేసును రద్దుపరచుకొంటిని.

ఈ నా వ్యాపారమునకు స్త్రీధనమే మూలధనమని చెప్పుకొనుటకు చాలా గర్వపడుచున్నాను. సుమారు అర్ధశతాబ్దమునకు మునుపు మనదేశములో అనుకూల దాంపత్య కుటుంబములు చాలా తక్కువగా నుండెను. భర్త భార్యను కొట్టుటయో, తిట్టుటయో, ఇంటినుండి